ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం భేటీ అయ్యారు. మొదట స్నేహపూర్వకంగా కరచాలనం చేసిన ఇరువురు దేశాధినేతలు.. అనంతరం నవ్వుతూ కెమెరాకు ఫోజు ఇచ్చారు. సింగపూర్‌లోని సెంటోసా దీవి వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక భేటీలో తొలిసారి కలిసిన ట్రంప్-కిమ్ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తమ చర్చలు సఫలీకృతం అవుతాయని, తమ భేటీ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మొదట దుబాసీల సాయంతో ట్రంప్-కిమ్ ఏకాంత ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాలకుపైగా వీరి భేటీ జరిగింది. ఈ సందర్బంగా ట్రంప్-కిమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏకాంత ముఖాముఖి భేటీకి ముందు ట్రంప్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ‘మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది’ అని కిమ్ అంటే.. కిమ్‌తో తన భేటీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘నాకు ఎంతో గొప్పగా ఉంది. మన సమావేశం నిజంగా ఫలప్రదం కాబోతుందని నేను భావిస్తున్నాను. మన మధ్య టెర్రిఫిక్ రిలేషన్ (అద్భుతమైన అనుబంధం) నెలకొనబోతోంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అని ట్రంప్ కిమ్‌తో పేర్కొన్నారు.