ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌తో అడ్డదారి తొక్కిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం జీవితంలో సినిమాటిక్ అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి 2015 సివిల్ సర్వీసెస్‌లో కరీం ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ర్యాంకు సాధించినా.. వద్దనుకుని ఐపీఎస్‌కు వచ్చారు. దీనికి ఓ సినిమాలో పాత్ర ఆయనకు స్ఫూర్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ తర్వాత పోలీసు ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ అధికారి కావాలని భావించారు. దీనికోసం పాల్పడిన హైటెక్ కాపీయింగ్‌కూ మరో చిత్రంలో సన్నివేశమే స్ఫూర్తి అని గుర్తించినట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై పోలీసు విభాగానికి చెందిన డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌తో పాటు దీని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది.