నిన్నటి దాకా కర్ణాటక కేంద్రంగా సాగిన కన్నడ రాజకీయం.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మారింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వారం గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది.
దీంతో కన్నడ రిసార్ట్ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో కర్నూలు-హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా రెండు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల తరలింపును జేడీఎస్ నేత థామస్ ధ్రువీకరించారు.