అవినీతి, అక్రమాలు, మోసాలు తప్ప చంద్రబాబు రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, అవకాశవాద రాజకీయాలకు ఆయన నిలువెత్తు రూపమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తన అవినీతిపాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరగాయని ఆరోపించారు. ‘జనచైతన్య’, ‘సత్యమేవ జయతే’ పేర్లతో రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరం మెసానిక్ టెంపుల్‌లో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.