ఆర్జీవీపై ప్రణయ్‌ తండ్రి ఫిర్యాదు.. | Pranay Father Files Complaint On Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

ఆర్జీవీపై ప్రణయ్‌ తండ్రి ఫిర్యాదు..

Published Sat, Jul 4 2020 5:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

సాక్షి, నల్గొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘మర్డర్‌’ సినిమాపై పెరుమాళ్ల ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్టౌన్ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అనేక పరిణామాలు, జైలు శిక్ష అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 21 ‘ఫాదర్స్‌‌ డే’ సందర్భంగా ..‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్‌ చేస్తున్నాను’ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement