నారాయణా విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లలో దాదాపు 30మంది విద్యార్థులు చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, విద్యాసంస్థల అధినేత నారాయణతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి మంత్రి నారాయణా బినామీ అని, అలాగే విద్యాశాఖ మంత్రికి ఆయన వియ్యంకుడు కాబట్టే ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారం తమదే అయినందున, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎటువంటి కేసుగానీ, కనీసం విచారణ కూడా చేపట్టడం లేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికాఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీనే స్వయంగా వెల్లడించారని రోజా పేర్కొన్నారు. కళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత అని ఆమె అన్నారు.
విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?
Published Sat, Oct 7 2017 4:33 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement