ట్రెయిన్ వచ్చి ప్లాట్‌ఫామ్‌పైన ఆగుతుంది. ఆ వెంటనే ప్రయాణికుల తోపులాట మొదలువుతుంది. ఒకరినొకరు తోసుకోవడం...తిట్టుకోవడం...కొట్టుకోవడం మామూలే.. ఎక్కడ చూసినా ఇదే సీన్.. జపాన్‌లోని రైల్వే స్టేషన్స్‌లో కూడా రద్దీ ఇలాగే ఉంటుంది. అక్కడ పీక్ అవర్స్‌లో ట్రెయిన్‌లోకి ఎక్కడం అంత ఈజీ కాదు.. మరి అప్పుడు వాళ్లేం చేస్తారు ? టోక్యో...! జపాన్ రాజధాని. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రతగల నగరాల్లో ఇదొకటి. బుల్లెట్ ట్రెయిన్లు మొదటిసారిగా ప్రారంభించింది ఇక్కడే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ ప్రయాణికులకు, టూరిస్టులకు మెరుగైన సేవలందిస్తోంది ఇక్కడి రైల్వే వ్యవస్థ. జపాన్‌లో ప్రజలు ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణిస్తారు. నిత్యం వందలాది ట్రెయిన్స్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా పరుగులు పెడుతూ ఉంటాయి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా...ఎన్ని ట్రెయిన్స్ ఉన్నా... పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. టోక్యో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులతో ఉదయం, సాయంత్రం వేళల్లో టోక్యోలోని పలు రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతూ ఉంటాయి. మామూలుగా ప్రతి అయిదు నిమిషాలకు ఒక ట్రెయిన్ వస్తుంది. రద్దీ వేళల్లో రెండు మూడు నిమిషాలకే ఒక రైలు ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుంది. అంటే గంటకు 24 ట్రెయిన్స్ నడుస్తూ ఉంటాయన్నమాట. ఇన్నేసి ట్రెయిన్స్ ఉన్నా రద్దీ వేళల్లో ప్రయాణికుల తాకిడి మామూలుగా ఉండదు.