కన్వార్ యాత్ర చేపట్టిన కొందరు శివభక్తులు ఇటీవల ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ఓ కారుపై దాడి చేశారు. వారు దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇందుకు సంబంధించి విమర్శలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే మరి కొందరు శివభక్తులు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేశారు. కర్రలతో ఆ వాహనం అద్దాలను పగులకొట్టారు. పోలీసులు వారించినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అయినా కొందరు పోలీసు వాహనం వెంట పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.