సాక్షి, న‍్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే... కవితకు అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ అనర్హత అన్నట్లుగా ... బుధవారం ఉదయం మురద్ ఆలం అనే వ్యక్తి.. వేరుశెనగకాయల్లో గింజలు తీసేసి... వాటి స్థానంలో విదేశీ కరెన్నీ నోట్లను దారంతో చుట్టి వాటిని సెలో టేప్ వేసి తీసుకు వచ్చాడు. మరోవైపు బిస్కెట్ ప్యాకెట్లలోనూ నోట్లను అమర్చాడు. అయితే అతగాడు బ్యాగ్‌లో బిస్కెట్ ప్యాకెట్లు, వేరుశెనగకాయలను అంత భద్రంగా తీసుకురావడంతో అనుమానించినసీఐఎస్‌ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు మురద్ ఆలం... ఈ కరెన్సీని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.