ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని గట్టిగా విశ్వసిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్షను రగిల్చారు. అన్ని వేదికలపై హోదా ఆవశ్యకతను వివరించారు. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పలుమార్లు వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది.