ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా శంకుస్థాపనలు, శ్వేతపత్రాలతో బిజీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసిన శంకుస్థాపనల రాళ్లతో పోలవరం ప్రాజెక్టు కట్టొచ్చునని వ్యాఖ్యాంచారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్లను కేంద్రప్రభుత్వం చేపట్టేలా ఒత్తిడి తేవడంలో టీడీపీ ప్రభత్వం విఫలమైందని మండిపడ్డారు. పబ్లిసిటీ, గ్రాఫిక్స్ మాయలతో ప్రజల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనల బాట పట్టారని ఎద్దేవా చేశారు. ‘గండికోటకు నీళ్లు రావడం వల్లనే కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని బాబు గతంలో వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనలోనే గండికోటకు నీళ్లొచ్చాయని విషయం బాబకు తెలియదా’ అని సూటిగా ప్రశ్నించారు.