ప్రత్యేక హోదా సాధన కోసం మొక్కవోని సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్, అవినాష్ ఆరోగ్యం బుధవారం తీవ్రంగా విషమించింది. దీంతో తక్షణమే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అందుకు ఎంపీలు నిరాకరించడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతిఘటిస్తున్నా.. దీక్షలోని ఎంపీలను బలవంతంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలవంతంగా అక్కడి నుంచి రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, జై జగన్, జై వైఎస్సార్‌సీపీ నినాదాలు మిన్నంటాయి. బలగాలను అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రయత్నించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.