ప్రీమియర్ సాకర్ లీగ్(పీఎస్‌ఎల్) సెమీఫైనల్ మ్యాచ్‌లో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన ఫుట్‌బాల్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక గ్రౌండ్‌లోకి చొచ్చుకువచ్చి ఇష్టానుసారం దాడులకు దిగారు. మోసెస్ మబిదా స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
జొహన్నస్‌బర్గ్‌కు చెందిన కైజర్ ఛీఫ్స్ జట్టు నెడ్ బ్యాంక్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 2-0 తేడాతో ఫ్రీ స్టేట్ స్టార్స్ జట్టుపై ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే తమ అభిమాన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలతో స్టేడియంలోకి చొచ్చుకువచ్చి గ్రౌండ్‌ను ధ్వంసం చేశారు. అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చి సెక్యురిటీ గార్డులపై దాడికి దిగారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన ఇరుజట్లకు చెందిన క్రీడాకారులు ఒక్కసారిగా గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకారులు బారీకేడ్లను కిందపడేసి, కుర్చీలు విసిరేసి, కెమెరాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. గ్రౌండ్‌లో కొన్నిచోట్ల నిప్పు కూడా పెట్టారు.