వాషింగ్టన్: ఓ కుటుంబం సరదాగా విహారయాత్రకు వెళ్లింది. నదిలో పడవ ప్రయాణం చేస్తుండగా ఓ ఎలుగుబంటి తల పెద్ద సీసాలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ కనిపించింది. దాని పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆ ఎలుగు బంటికి సాయం చేయాలనుకున్నారు. దాన్ని పట్టుకుని నానా తంటాలు పడి తలకు ఉన్న సీసాను తొలగించారు. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్‌సిన్‌లో చోటు చేసుకుంది. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. ట్రిసియా, తన భర్త, కొడుకుతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అందులో భాగంగా అందరూ కలిసి మార్ష్‌మిల్లర్ నదిలో బోటింగ్ చేశారు. ఈ క్రమంలో అదే నదిలో పెద్ద సీసాలో తల ఇరుక్కుపోయి తెగ ఇబ్బంది పడుతూ ఓ పిల్ల ఎలుగుబంటి కనిపించింది. ఎంతో కష్టంగా అది స్విమ్మింగ్ చేస్తుండటం చూసి వారి గుండె తరుక్కుపోయింది. వెంటనే దాని దగ్గరకు పడవను పోనిచ్చారు. దాన్ని వెంబడించి పట్టుకున్నారు. ట్రిసియా భర్త ఎలుగుబంటి తలకు ఉన్న క్యాన్‌ను గట్టిగా పైకి లాగడంతో దానికి విముక్తి లభించింది. పిల్ల ఎలుగుకు స్వేచ్ఛ లభించడంతో ట్రిసియా ఎగిరి గంతేసినంత పని చేసింది. "మేము దాన్ని కాపాడాం. ఇప్పుడిక సంతోషంగా ఈదుకుంటూ వెళ్లు" అని ఆమె మాట్లాడటం వీడియోలో స్పష్టమవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసిన ఉపకారానికి పొగడకుండా ఉండలేకపోతున్నారు.