Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains1
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates2
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Trump slaps 100% tariff on foreign films3
దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

Security Tight At Jammu And Srinagar Jails4
బాంబులు గుర్తింపు.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్‌ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌, శ్రీనగర్‌లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్‌, ముష్తాక్‌ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్‌లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్‌ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్‌ పరిధిలో 12 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్‌ అధికారి ఒకరు చెప్పారు.

IPL 2025: Sunrisers Hyderabad Sign Harsh Dubey As Injury Replacement For Smaran Ravichandran5
IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే డు ఆర్‌ డై మ్యాచ్‌కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్‌ రవిచంద్రన్‌ స్థానంలో విదర్భ లెఫ్డ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబేను జట్టులోకి తీసుకుంది. హర్ష్‌ను బేస్‌ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడ్డాడు.Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025ఎవరీ హర్ష్‌ దూబే..?పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్‌ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్‌ దూబే.. తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. హర్ష్‌ విదర్భ తరఫున 18 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 21 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.హర్ష్‌ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్‌ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.నిష్క్రమణ అంచుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు గెలిచినా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరడం అసంభవం. టెక్నికల్‌గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్‌ కాలేదు కానీ, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్‌ స్టేడియం) టేబుల్‌ ఫిఫ్త్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ALL Party Meeting In Pakistan Over India Tension6
యుద్దానికి రెడీ.. పాక్‌లో అఖిలపక్ష భేటీలో ఆర్మీ అధికార ప్రతినిధి

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్‌ దాడులు చేస్తుందనే కారణంగా పాక్‌కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్‌ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధ సన్నద్దతపై వివరణ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. భారత్‌ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్‌ అలర్ట్‌ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్‌, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్‌ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ హాజరు కాలేదని సమాచారం.ఇదిలా ఉండగా.. భారత్‌ పర్యటనకు ముందు పాక్‌లో పర్యటిస్తున్న ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్‌లో దిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని వ్యాఖ్యాలు చేశారు. ఇక, అంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని అబ్బాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Differences across the lifespan between females and males: GBD Study7
అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!

పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్‌ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్‌ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్‌లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్‌తో 25 దేశాల్లో, డయాబెటిస్‌తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్‌కు చెందిన గ్లోబల్‌ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్‌ బస్‌ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!)

Babil Khan Slams Director Sai Rajesh Criticising His Statement on Crying video8
సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్‌.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో

బాలీవుడ్‌లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్‌ అయ్యాడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు, హీరో బాబిల్‌ ఖాన్‌ (Babil Khan). అర్జున్‌ కపూర్‌, అనన్య పాండే, షనయా కపూర్‌, అర్జిత్‌ సింగ్‌.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్‌ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అసలు ఏమనుకుంటున్నావ్‌?కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్‌, అనన్య, షనయా, అర్జిత్‌లను తాను విమర్శించలేదని, సపోర్ట్‌ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్‌ చేసిన మేము ఇప్పుడు సైలెంట్‌గా ఈ టాపిక్‌ను వదిలేయాలంటావ్‌.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్‌? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? సారీ చెప్పాల్సిందే!నీకు సపోర్ట్‌ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన బాబిల్‌.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్‌.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.మణికట్టు కోసుకున్నాఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్‌. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్‌ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్‌ డిలీట్‌ చేశాడు.బేబీ రీమేక్‌లో బాబిల్‌?బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్‌ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్‌. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్‌ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్‌ చివరకు అతడిని రిజెక్ట్‌ చేశాడని తెలుస్తోంది. Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”byu/Normal_Weather8827 inBollyBlindsNGossip చదవండి: బాలీవుడ్‌ అంతా కాపీనే: నవాజుద్దీన్‌ సిద్దిఖీ

Market uncertainties inevitable but smart strategies help investors9
అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్‌ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్‌ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్‌ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్‌ పరిమితిని సీనియర్, నాన్‌ సీనియర్‌ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్‌ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్‌ వర్తించదు. నాన్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్‌ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్‌ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి వచ్చే డివిడెండ్‌ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్‌ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్‌ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసే వారికి మార్కెట్‌ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్‌సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Rajasthan MLA Arrested By ACB For This Reason10
అసెంబ్లీలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’?.. ఎమ్మెల్యే అరెస్ట్‌!

ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది. జైపూర్‌: భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ జైపూర్‌ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్‌ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్‌ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్‌ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్‌ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్‌ చేశారు. అయితే చివరకు డీల్‌ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, స్పీకర్‌ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవి ప్రకాష్‌ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్‌ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్‌ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్‌(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే. భారత్‌ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్‌ ఆదివాసీ పార్టీ కన్వీనర్‌, బం‌స్వారా ఎంపీ రాజ్‌కుమార్‌ రావోత్‌ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్‌ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement