Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

No More Discussions On Banakacherla Says Telangana Letter To Centre1
బనకచర్ల.. ఏపీకి షాకిచ్చిన తెలంగాణ

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమీరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో రేపు(జూలై 16, 2025) అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో..ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని పేర్కొంది. అయితే..అయితే బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్‌ ఎజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట ఇచ్చింది. ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. బీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించే బనకచర్లపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఇతర అంశాలపై చర్చి‍స్తేనే మీటింగ్‌కు వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి స్పష్టం చేసింది.తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పందంగా మారింది తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా లేఖతో జరగబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలుప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వాదనగోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయంనాగార్జునసాగర్ వాడకాన్ని తప్పుబడుతూ, పర్యావరణ నష్టం గురించి ఆందోళన ఏపీ వాదనలువర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను వినియోగించాలన్న ఉద్దేశంరూ.80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన3 దశల్లో నిర్మాణం: పోలవరం → బొల్లపల్లి → బనకచర్లఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించివేసింది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే గోదావరి వరద జలాల లభ్యతపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.ఇదీ చదవండి: బనకచర్ల.. గురు శిష్యుల డ్రామానా?

Kommineni Comments On Chandrababu Diversion Politics2
బాబుగారు.. అయ్యే పనులు చెప్పండి సార్‌!

ముగ్గురు పిల్లల్ని కనే తల్లిదండ్రులు దేశభక్తులట! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొత్త ఉవాచ ఇది! డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చేయితిరిగిన నేత తాజాగా ఎత్తుకున్న నినాదం ఇది అనుకోవాలి. జనాభాను పెంచాలంటున్నారు ఆయన. కానీ.. ఇదే ప్రామాణికమైతే చంద్రబాబు క్యాబినెట్‌లో దేశభక్తులు ఎందరని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అందరికంటే ముందు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కు సలహా ఇచ్చి దేశభక్తుడిని చేయాలి కదా? అని కొందరు చమత్కరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో కోటి మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. వారిలో పిల్లలను కనే అర్హత ఉన్నవారు ఎందరు..? చంద్రబాబు సూచన పాటించి 2029 నాటికి జనాభాను ఎంతమేరకు పెంచుతారు? మొదలైన వాటి గురించి చెప్పి ఉంటే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది కదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అంశం కాదు. దేశానికి ఒక జనాభా విధానం ఉంటుంది. అయినా రాష్ట్రాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని చంద్రబాబు చెబుతున్నట్లు పిల్లలను కనకపోతేనో, కంటేనో దేశభక్తులు అవడం, అవ్వకపోవడం ఉండదు. ప్రతి కుటుంబం తన స్థోమతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని విస్మరించరాదు.‘‘అన్నీ వేదాలలో ఉన్నాయష’’ అన్న డైలాగు ఒకటి గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో ఉంటుంది. అలాగే దేశంలో కాని, ప్రపంచంలో కాని ఏది జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ మధ్యనే ఆయన ఆవుల నుంచి పాల పిండడం తానే నేర్పించానంటున్నట్లుగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అలాగే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులలో మెజార్టీ తానే కట్టానని చెప్పుకున్నారు. అసలు భారీ ప్రాజెక్టులపై అంతగా విశ్వాసం లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. నీటి ఎద్దడికి ఇంకుడు గుంతలే పరిష్కారం అని భావించి గతంలో ఆ కార్యక్రమం అమలు చేశారు. తర్వాత కాలంలో వదలివేశారు. అది వేరే విషయం. ఒకప్పుడు జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని తాజాగా అన్నారు. ఇద్దరు మించి పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులని తానే చట్టం తెచ్చానని కూడా చెప్పేశారు. నిజానికి 1960, 70 దశకాలలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ఒక విధానంగా దేశం అంతటా అమలు చేసింది.ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలన్న పాటలు అప్పట్లో బాగా వినిపించేవి. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు పిల్లలు మించి ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులన్న చట్టాన్ని తీసుకువచ్చారు. ఏ కుటుంబం అయినా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కువ మంది పిల్లలను కంటుందా? అసలు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలను ఎక్కువ మందిని కనాలని, అందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. ఈ సమస్య దేశంలో ఎందుకు ప్రధానంగా వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ మంది పిల్లలను కంటుండడం, దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ పద్దతులు పాటిస్తుండడం వల్ల ప్రాంతాల జనాభాలలో బాగా తేడా వచ్చింది.దీని ఫలితంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, నార్త్ రాష్ట్రాలలో గణనీయంగా సీట్లు పెరిగి వారి పెత్తనం మరింత అధికం అవుతుందన్నది ఆందోళన. దీని గురించి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా, ఏపీలో పిల్లలను అధికంగా కనండని చెబుతున్నారు. జపాన్, చైనా తదితర దేశాలతో పోల్చుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ దేశాలలో కొంత సమస్య ఉన్నమాట నిజమే కావ,చ్చు. కాని అక్కడి పరిస్థితులు వేరు. ఆ దేశాలు అనుసరిస్తున్న పద్దతులు వేరు. అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన రీతిలో జనాభా వృద్ది రేటు ఉండడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి.ప్రధానంగా నగరీకరణ, జీవన వ్యయం పెరిగిపోవడం, సాంస్కృతిక, సంప్రదాయాలలో మార్పులు రావడం, పిల్లలను పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం, మహిళలు అటు కుటుంబ జీవనం, ఇటు కెరీర్ బ్యాలెన్స్‌ చేసుకోవడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు వంటివి ఉన్నాయి. జపాన్‌లో ఒకరికి జన్మనిస్తే ఏభైవేల యెన్ లు ఇవ్వాలన్న స్కీమ్ ఉంది. ఇది ఆదాయ పరిమితి లేకుండా అమలు చేస్తున్నారు. పిల్లల పెంపకం, బేబీ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు భరించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు స్ట్రోలర్లు మొదలు డైపర్ల వరకు ప్రభుత్వమే ఇస్తుందట. అయినా జపాన్ లో జనాభా పెరుగుదల పెద్దగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పెరిగితే ఎకానమీ కొంత పెరగవచ్చు కాని, దాంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నది నిపుణుల అంచనా. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలలో తక్కువ జనాభాతో మంచి ఆర్థిక ప్రగతిని సాధించాయి.చైనాలో ఒకప్పుడు ఒకరినే కనాలన్న నిబంధన ఉన్నా, దానిని క్రమేపి ముగ్గురికి పెంచారు. అందుకు కారణం వృద్దుల సంఖ్యకు, యువతకు మధ్య సమతుల్యత లేకపోవడమే. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. రిటైర్మెంట్‌ వయసు పెంచడం, రిటైరైనా పార్ట్ టైమ్‌ ఉద్యోగాలు చేయడం, వలసలను ప్రోత్సహించడం, ఇతర ప్రోత్సహాకాలు వంటివి చేస్తున్నాయి. జపాన్ వంటి దేశాలలో వలసలు కూడా ఎక్కువగా ఉండడం లేదు. ఏపీ విషయానికి వస్తే, ఒకవైపు అమరావతి పేరుతో కొత్తగా నగరాన్ని నిర్మిస్తానని చెబుతుంటారు. అంటే అర్బనైజేషన్ పెంచడం అన్నమాట. మరోవైపు అర్బనైజేషన్ వల్ల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా కేంద్రీకరణ వల్ల ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాలలో మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరుగుతోంది. అందరికి సరిపడా నీటిని సరఫరా చేయడం కష్టం అవుతోంది.అయినా ఒక నగరాన్ని సృష్టించడం అంత తేలిక కాదు.దానంతట అది సహజంగా అభివృద్ది చెందాలి తప్ప. పిల్లలను కంటే జపాన్ లో భారీ మొత్తాన్ని ప్రోత్సాకంగా ఇస్తున్నారు. ఆ పని చంద్రబాబు సర్కార్ చేయగలదా? తల్లికి వందనం పేరుతో విద్యార్దులందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానాలలో చేశారు. దానిని ఒక ఏడాదంతా ఎగవేశారే! ఈ ఏడాది ఇచ్చినా అదేదో కొత్తగా లోకేశ్‌ కనిపెట్టినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. గత ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలకు అబద్దాలు ఆడరాదని బోధించాల్సి చోటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సత్యదూరం అయిన విషయాలు చెప్పవచ్చా అన్న చర్చ వచ్చింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చారు.దాని సంగతేమిటి? ఇదేదో డబ్బు వస్తుందిలే అని నమ్మి మహిళలు ఎక్కువమంది పిల్లలను కంటే వారికి ఇబ్బందే కదా! నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ప్రామిస్ చేశారు. దాని అతీగతి లేదు. ఇలా హామీలను ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సహకాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? జపాన్‌లో మహిళల కాన్పునకు అయ్యే వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీలో అలా చేయగలుగుతారా? ఆరోగ్యశ్రీని నీరు కార్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా! పిల్లల చదువుకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ వంటివి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని బకాయిల మాటేమిటి? ఇవన్ని పెట్టుకుని పిల్లలను ఎక్కువ మందిని కంటే దేశభక్తులని చెబితే ఎవరు నమ్ముతారు.డబ్బు ఉన్నవారు ఒకరు, ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. పేదలు ఎక్కువ మందికి జన్మనిస్తే, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు. వ్యవసాయ కార్మికులు అవసరమైన మేర లభించకపోవడానికి, ఇతరత్రా పనులు చేసేవారు లేక పోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వ్యవసాయం అంత గిట్టుబాటు కాదని, ఇతర రంగాలకు మళ్లాలని గతంలో ఒకసారి సీఎం అన్నారు. నిజంగానే కూటమి సర్కార్ వచ్చాక వివిధ పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు.నష్టాల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువమంది పిల్లలను కనండని రైతులకు, వ్యవసాయ కార్మికులకు చెబితే వారు ఏమని జవాబు ఇస్తారు.. ఇలా నేల విడిచి సాము చేసినట్లు చంద్రబాబు నాయుడు ఏదో ఒక కొత్త డైలాగు తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఆచరణాత్మక విధానాలవైపు వెళితే మంచిది కదా! పిల్లలను ఎక్కువ మందిని కనడం అన్నది దేశభక్తికి సంబంధించింది కాదు..ఆయా కుటుంబాల ఆర్థిక శక్తికి సంబంధించిన విషయం. తమ కుటుంబాలలో ఆచరించచని పద్దతులను ప్రజలు పాటించాలని చంద్రబాబు వంటివారు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Medak: Sensational Details Come To Light In Congress Leader Anil Case3
కాంగ్రెస్‌ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

సాక్షి, మెదక్‌: కాంగ్రెస్‌ నేత అనిల్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్‌ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్‌ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్‌ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్‌ నేత అనిల్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్‌(28)జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్‌ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్‌ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్‌ శరీరంపై బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి.

US Supreme Court Clear Line For Trump To Dismantling Education Department4
ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్‌ క్లియర్‌

తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్‌ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్‌ మహోన్‌ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్‌ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్‌ లీవ్‌లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్‌తో పాటు మసాచుసెట్స్ పబ్లిక​ స్కూల్‌ సిస్టమ్స్‌ & యూనియన్స్‌ పిటిషన్లు వేశాయి.అయితే మే 22వ తేదీన బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్‌ జోన్‌ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్టు(బోస్టన్‌)ను ట్రంప్‌ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్‌ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.లిండా.. ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్‌పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్‌నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఎందుకీ నిర్ణయమంటే..అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్‌ గవర్నమెంట్‌ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్‌ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్‌ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్‌ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్‌(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్‌ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్‌ సెనేటర్‌ చుక్‌ షూమర్‌ అభిప్రాయపడుతున్నారు.

IND U19 VS ENG U19 1st Youth Test: Vaibhav Suryavanshi Scored 56 Of 44 In Second Innings5
సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్‌ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం​

ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్‌ టెస్ట్‌లో భారత యువ జట్టు చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన వైభవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే ఈ ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే ఔటయ్యాడు. మరో స్టార్‌ ప్లేయర్‌ చవ్డా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. విహాన్‌ మల్హోత్రా (34), అభిగ్యాన్‌ కుందు (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చీ వాన్‌ 3 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్‌ (93), కెప్టెన్‌ హమ్జా షేక్‌ (84) సత్తా చాటారు. లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాళ్లు ఎకాంశ్‌ సింగ్‌ (59), రాల్ఫీ ఆల్బర్ట్‌ (50) అర్ద సెంచరీలతో రాణించారు. జాక్‌ హోమ్‌ (44), థామస్‌ రూ (34), జేడన్‌ డెన్లీ (27), జేమ్స్‌ మింటో (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హెనిల్‌ పటేల్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్‌, వైభవ్‌ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్‌ దేవేంద్రన్‌, మొహమ్మద్‌ ఎనాన్‌, విహాన్‌ మల్హోత్రా తలో వికెట్‌ తీశారు.దీనికి ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (102) సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్‌ మల్హోత్రా (67), అభిగ్యాన్‌ కుందు (90), రాహుల్‌ కుమార్‌ (85), ఆర్‌ఎస్‌ అంబరీష్‌ (70) అర్ద సెంచరీలతో రాణించారు.కుర్ర చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. వైభవ్‌ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో రాల్ఫీ ఆల్బర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్‌ ఎనాన్‌ 23, హెనిల్‌ పటేల్‌ 38, దీపేశ్‌ దేవేంద్రన్‌ 4, అన్మోల్‌జీత్‌ సింగ్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో గ్రీన్‌, ఆల్బర్ట్‌ తలో 3 వికెట్లు తీయగా.. జాక్‌ హోమ్‌, ఆర్చీ వాన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్‌ మినహా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో చెలరేగిపోయాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు.

 IPS officer VC Sajjanar incredible experience in the wild heart of Tipeshwar 6
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!

ఐపీఎస్‌ ఆఫీసర్‌ వీసీ సజ్జనార్‌ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Mahatashtra) అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణ గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలిపోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమైపోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్‌లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025

Entrepreneur Commits Rs 1 Crore To Fix Bengaluru Traffic7
కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్‌ సమస్యను తీర్చేద్దాం!

మహానగరాల్లో ట్రాఫిక్‌ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్‌లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్‌ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్‌ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్‌ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్‌ మై ట్రిప్‌’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్‌ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్‌ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్‌ పట్టిందట.ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లేదా సిగ్నల్‌ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్‌! ఈ జామ్‌లతో విసిగిపోయిన ప్రశాంత్‌... తన ఎక్స్‌ అకౌంట్‌లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్‌ మ్యాప్స్‌, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.గూగుల్‌ మ్యాప్స్‌కు శాటిలైట్‌ ఇమేజరీ తోడు...ఈ ఏడాది ఏప్రిల్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ‘‘రోడ్‌ మేనేజ్మెంట్‌ ఇన్‌సైట్‌’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్‌. ఏ రోడ్డులో ట్రాఫిక్‌ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్‌ మేనేజ్మెంట్‌ ఇన్‌సైట్‌. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్‌ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్‌ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్‌ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్‌ మ్యాప్స్‌, జీపీయూ, ఏపీఐ కాల్స్‌, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు, కార్పొరేషన్‌లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.బెంగళూరు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్‌ను ట్యాగ్‌ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్‌కు ‘ఇన్‌’ అని కామెంట్‌ చేయాలని, ట్రాఫిక్‌ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్‌పై కామెంట్‌ చేయడంతోపాటు నలుగురికి షేర్‌ చేయాలని కోరారు. ఆల్‌ ద బెస్ట్‌ ప్రశాంత్‌ పిట్టి!

Private schooling quietly draining India middle class8
మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం

లాభాపేక్ష లేని సంస్థలుగా పని చేయాల్సిన విద్యాసంస్థలు కార్పొరేట్‌ మాఫియాగా మారి తల్లిదండ్రుల నుంచి భారీగా దన్నుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని యాజమాన్యాలు చెప్పినకాడికి ముట్టజెప్పుతున్నారు. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం కంటే నిశ్శబ్దంగా విద్యా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ప్రైవేట్ విద్య ఆర్థిక సవాలుగా మారిందని, పెరుగుతున్న పాఠశాల ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నట్లు విద్యావేత్త, చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో చిన్నారికి రూ.3.5 లక్షల వరకు..గోయల్ లింక్డ్ఇన్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లోని చాలా పాఠశాలల్లో ప్రైమరీ విద్య కోసం సుమారుగా అడ్మిషన్ ఛార్జీలు రూ.35 వేలు, ట్యూషన్‌ ఫీజు రూ.1.4 లక్షలు, వార్షిక ఛార్జీలు రూ.38 వేలు, రవాణా ఫీజు రూ.44 వేల నుంచి రూ.73 వేలు, పుస్తకాలు, యూనిఫామ్‌లకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు బాదుతున్నారు. అంటే ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2.5-రూ.3.5 లక్షలు’ అని చెప్పారు.ఫీజుల కోసం ఈఎంఐలు..‘మిడ్ టైర్ స్కూళ్లు కనీసం రూ.లక్ష ఫీజుతో ప్రారంభిస్తున్నాయి. ఎలైట్ స్కూళ్లు ఈజీగా రూ.4 లక్షలతో అ‍డ్మిషన్‌ మొదలు పెడుతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాం, కానీ విద్యా ద్రవ్యోల్బణం మధ్యతరగతి పాలిట శాపంగా మారుతోంది. ఫిన్‌టెక్‌ సంస్థలు ఇప్పుడు పాఠశాల ఫీజుల కోసం ఈఎంఐలను అందిస్తున్నాయి’ అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యామ్నాయం కాదు. అందులోనూ 8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క యూపీలోనే 5వేల పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థుల్లో 70 శాతం మంది పేరాగ్రాఫ్ చదవలేని పరిస్థితులున్నాయి. విద్యుత్ లేని లక్ష పాఠశాలలున్నాయి. మరుగుదొడ్లు లేని 46,000 పాఠశాలలు, తాగునీరు లేని పాఠశాలలు 39,000 ఉన్నాయి. భారతదేశం జీడీపీలో కేవలం 4.6% మాత్రమే విద్యపై ఖర్చు చేస్తుంది. వివిధ కమిటీలు సిఫార్సు చేసిన 6% కంటే ఇది చాలా తక్కువ.ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ నిధి విడుదలకు డేట్‌ ఫిక్స్‌?ఏం చేయాలంటే..‘చట్టపరంగా లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థలోని చాలా లొసుగులను అన్వేషిస్తున్నాయి. డొల్ల కంపెనీల ద్వారా యజమానులు తమ సొంత పాఠశాలలకు ఆస్తులను లీజుకు ఇవ్వడం, అధిక అద్దెలు వసూలు చేయడం, బిల్లును ఫీజుల రూపంలో తల్లిదండ్రులకు పాస్‌ఆన్‌ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల నుంచి తప్పించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు’ అని గోయల్ తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్‌ విద్యా సంస్థల ఆర్థిక దోపిడిని కట్టడి చేయాల్సి ఉంది. కొందరు అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి తల్లిదండ్రుల నెత్తిన భారం మోపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన పరిస్థితులపై యంత్రాంగం దృష్టి సారించాలి.

Firing On Morning Walkers In Malakpet Hyderabad9
హైదరాబాద్‌: పార్క్‌లో కాల్పుల కలకలం

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్‌ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్‌ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్‌ చేస్తున్న సమయంలో చందు నాయక్‌ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్‌ నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్‌తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్‌లో ఉన్న బుల్లెట్స్‌ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్‌ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్‌లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్‌లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్‌వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్‌ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్‌తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు.

Producer Namit Malhotra Confirms Ramayana Movie Budget10
'రామాయణ' బడ్జెట్‌ రివీల్‌ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు

రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్‌ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ విజువల్స్‌ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్‌ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్‌ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్‌లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్‌ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్‌లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20​కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్‌ హిట్‌ చిత్రాలు బ్యాట్‌మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్‌ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement