కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా? | Andhra: Kapu protest for Backward Class status turns violent | Sakshi

కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా?

Feb 1 2016 4:02 AM | Updated on Jul 30 2018 6:29 PM

కాపు గర్జన ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కోపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలపై చూపించారు.

సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కాపు గర్జన ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కోపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలపై చూపించారు. కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా అని పార్టీ నేతలను ప్రశ్నించి.. దాన్ని పసిగట్టలేకపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం నుంచి గర్జన పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ వచ్చారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ ఏంజరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహించినట్లు సమాచారం.

సమావేశం జరుగుతుందని మాత్రమే అంచనా వేశామని, అప్పటికప్పుడు ముద్రగడ ఆందోళనకు పిలుపునిస్తారని ఊహించలేదని అధికారులు వివరణ ఇచ్చినా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోవడం, కనీసం అక్కడ ఏంజరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరే కారణమని ఆ పార్టీలోని కాపు నేతలు అంటున్నారు. సీఎం అయిన తరువాత కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని పట్టించుకోకపోవడం, కాపు నాయకుల్ని ఎదగనీయకుండా తొక్కిపెట్టడం వంటివాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు.
 
కట్టడి చేయడం వల్లే..
‘కాపు నాయకులు ఎవరూ సభకు వెళ్లవద్దని టెలి కాన్ఫరెన్సుల్లో మా అధినేత ఆదేశించడం వల్లే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. పార్టీలోని కాపు ఎమ్మెల్యేలను వెళ్లనిచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. నెరవేర్చకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగింది.

బాబుపై నమ్మకం లేకపోవడం వల్లే ఉద్యమించి సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కాపు కార్పొరేషన్ జీవో జారీచేసి ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు రూ.వంద కోట్లే ఇవ్వడంతో యువతలో కోపం పెరిగింది. ఇవన్నీ కాపు ఉద్యమం వైపు జనాన్ని నడిపించాయి. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబే బాధ్యుడు. కాపు గర్జనలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నా.. వైఎస్సార్ సీపీని టార్గెట్ చేయడం కూడా తప్పే. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. ఇది పార్టీకే నష్టం..’ అని టీడీపీలోని కాపు నాయకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement