
ఉరేసుకుని 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరులో ఘటన
నెల్లూరు: ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలికకు ఏ కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూరులో గురువారం జరిగింది. ఎస్సై జిలానీ, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని వందూరుగుంట ప్రాంతానికి చెందిన ప్రకాష్, రత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ప్రకాష్ పెయింట్ పనిచేస్తుంటాడు. రత్నమ్మ ప్రభుత్వాస్పత్రిలో తాత్కాలిక నర్సుగా వ్యవహరిస్తోంది.
పెద్ద కుమార్తె నిహారిక (11) జెడ్పీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నిహారిక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. నానమ్మ భోజనం తినాలని చెప్పగా స్కూల్లోనే చేశానంది. ఆ సమయంలో రత్నమ్మ సమీపంలోని తెలిసిన వారింటికి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఇంటికొచ్చి కుమార్తెను పిలవగా స్పందన లేదు. దీంతో నానమ్మ మిద్దైపెన బాత్‌రూమ్‌కు వెళ్లిందని చెప్పడంతో తల్లి అక్కడికి వెళ్లి పిలిచింది. అయితే నిహారిక పలక్కపోవడంతో కేకలు వేసింది.
కిందనే ఉన్న భర్త ప్రకాష్‌కు తెలిపింది. అతను పైకి వచ్చి కొంత ప్రయత్నం చేసి తలుపు తీశాడు. ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించిన నిహారికను చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తల్లి గుర్తించింది. హుషారుగా తిరిగే నిహారిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ కానిస్టేబుల్ విజయకుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.