
తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌కు మంత్రి లోకేశ్ ఆదేశం?
పనులు అడిగితే జనసేనలోకి రమ్మంటున్నారు
తిరుపతి టీడీపీ అంతర్గత సమావేశంలో లోకేశ్‌కు నాయకుల ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హలో కమిషనర్ గారూ.. కార్పొరేషన్‌లో పనులన్నీ మనవారికే ఇవ్వండి. నేను మనిషిని పంపుతున్నాను. పనులు అతనికి అప్పగిస్తే.. అతను పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తారు.’ అని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌ని మంత్రి నారా లోకేశ్ ఆదేశించినట్లు తెలిసింది. తిరుపతి పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం, ఓటరు వెరిఫికేషన్, టీడీపీ యాప్‌లో ఉత్తమ పనితీరు కనబరచిన కార్యకర్తలు, నాయకులకు ప్రశంసాపత్రాలు పంపిణీ చేసి అభినందించారు.
ఈ సమయంలో తిరుపతి 31వ వార్డుకు చెందిన తలారి బాలయ్య... స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆ పార్టీ నాయకుల తీరుపై ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టుల కోసం స్థానిక ఎమ్మెల్యే, జనసేన ముఖ్య నాయకుల వద్దకు వెళితే.. పార్టీలో చేరితే ఇస్తామని తేల్చి చెబుతున్నట్లు తెలిపారు. ఏ విషయం గురించైనా ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వద్దకు వెళితే.. జనసేనలో చేరాలని టీడీపీ శ్రేణులపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. మరో మహిళా నాయకురాలు కూడా జనసేన ఎమ్మెల్యే, నాయకులపైనా ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత లోకేశ్ తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌కి ఫోన్ చేసి ‘తలారి బాలయ్య అనే నాయకుడిని పంపిస్తా. పనులు అతనికి అప్పగిస్తే.. అతను ఎవరెవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు..’ అని చెప్పినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం జనసేన ఎమ్మెల్యే, ఆపార్టీ నేతల వ్యవహారాల గురించి వివరించినట్లు సమాచారం. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
‘జనసేన నేతలు కలిసి వస్తే కలిసి నడవండి. లేదంటే వదిలేయండి..’ అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఇంత జరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నారు? అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను లోకేశ్ ప్రశ్నించినట్లు తెలిసింది. అందరూ కలిసికట్టుగా పని చేసి ఇటీవల డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నట్లుగానే మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోవాలని ఆయన సూచించినట్లు తిరుపతిలో జోరుగా ప్రచారం సాగుతోంది.