ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి | Two cases against former YSRCP MP Nandigam Suresh | Sakshi

ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి

Oct 27 2024 5:45 AM | Updated on Oct 27 2024 5:45 AM

Two cases against former YSRCP MP Nandigam Suresh

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై వేధింపులకు పరాకాష్ట

ఒకే ఘటనపై ఒకే వ్యక్తి రెండుసార్లు ఫిర్యాదు.. రెండు కేసులు

2023 మార్చి 31న ఓ కేసు.. ఏడాదిన్నర తర్వాత మరోసారి

రెండోసారి హత్యాయత్నం కేసు నమోదు

ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణం! 

ఇది సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే!

రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై విస్తుపోతున్న న్యాయనిపుణులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేతలను వేధింపులకు గురి చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలను, చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది. కేవలం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం తప్ప మరేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒకే కేసుకు సంబంధించి, ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి చట్టాలను సైతం బేఖాతరు చేసింది. 

2023లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లోనే సురేష్‌పై తుళ్లూరు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదే ఘటనపై అదే వ్యక్తి మళ్లీ ఫిర్యాదు చేస్తే.. ఏడాదిన్నర తర్వాత శుక్రవారం మరో కేసు నమోదు చేయడం కూటమి సర్కారు కక్ష సాధింపులకు పరాకాష్టే. ఇక్కడే చట్టాలను, రెజ్యూడికాటాను సర్కారు ఉల్లంఘించింది.

2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతులు, పేదలను, వారికి అండగా నిలిచిన సురేష్‌ను అక్రమ కేసులతో వేధించింది. ఆ తర్వాత బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ తమపై దాడి చేశాడంటూ 2023 మార్చి 31న విజయవాడకు చెందిన పనతల సురేష్‌ అనే వ్యక్తి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోజు అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆయన చేసిన ఫిర్యాదుపై అదే రోజున తుళ్లూరు పోలీసులు ఐపీసీ 294, 323, 427 రెడ్‌ విత్‌ 34 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మళ్లీ అదే పనతల సురేష్‌ అదే ఘటనపై ఏడాదిన్నర తర్వాత ఈ నెల 25న ఫిర్యాదు చేయగా.., నందిగం సురేష్‌పై ఐపీసీ 341, 143, 147, 307, 427 రెడ్‌విత్‌ 149 సెక్షన్లతో మరోసారి కేసు నమోదు చేశారు. ఇలా ఒకే ఘటనపై రెండు కేసులు (ఎఫ్‌ఐఆర్‌లు) నమోదు చేయడం ఒక తప్పు అయితే.. ఏకంగా హత్యా నేరం సెక్షన్లు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనం. 

ఇప్పటికే తనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు కేసుల్లో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఓ పాత ఘటనలో మరోసారి కేసు పెట్టడమే కాకుండా, హత్యా­యత్నం కేసు పెట్టడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల బలమైన ఆదేశాలే కారణమన్నది జగమెరిగిన సత్యం.



రెజ్యూడికాటాను ఉల్లంఘించడమా..!
వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపులకు ప్రభు­త్వం, పోలీసులు రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై న్యాయ నిపుణులు సైతం విస్తుపోతు­న్నారు. సహజ న్యాయ సూత్రాల్లో రెజ్యూడికాటా (లాటిన్‌ పదం) గురించి స్పష్టంగా విశదీకరిస్తు­న్నారు. ఒకే ఘటన, ఒకే వ్యక్తి ఫిర్యా­దుపై ఒకటికి మించి కేసులు నమోదు చేయకుండా నిలువరించడమే రెజ్యూడికాటా. 

ఇలాంటి కేసులు సహజ­న్యా­యానికి కూడా విరుద్ధమని ఇది స్పష్టం చేస్తుంది. ఒకే వివాదం లేదా ఒకే ఘటనలో అదే పార్టీల మధ్య వ్యాజ్యా­లను పదే పదే విచారించడం వల్ల న్యాయ వ్యవస్థ సమయం కూడా వృథా అవుతుందనే దీనిని పరిగణనలోకి తెచ్చారు. ఏదైనా కేసులో తుది తీర్పు వెలువడకుండా అదే కోర్టులో అదే కేసుపై మరో వివాదాన్ని లేవనెత్తితే దాని పునఃపరిశీ­లనను తిరస్కరించేందుకు న్యాయ­స్థానం సైతం దీన్ని ఉపయోగిస్తుంది. 

ఈ రెజ్యూ­డికాటా క్రిమినల్‌ చట్టంలో డబుల్‌ జియోపార్డీ, నాన్‌ బిస్‌ అనే భావనను పోలి ఉంటుంది. క్రిమి­నల్‌ ప్రాసిక్యూషన్‌లో ఒకే నేరానికి ఒకే విధమైన ప్రాసిక్యూషన్‌ను మాత్రమే ఉండేలా చేయడంతోపాటు రెండో విచారణకు సంబంధించిన చర్య­లను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు విశదీ­కరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement