
ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియం పెంపునకు చెక్
ఐఆర్‌డీఏఐ నుంచి సీనియర్ సిటిజన్లకు ఊరట
ముంబై: ఆరోగ్య బీమా రంగ కంపెనీలు ఇకపై సీనియర్ సిటిజన్ల వార్షిక ప్రీమియంలో పెంపుదలను 10 శాతంలోపునకే పరిమితం చేయవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తక్కువ ఆదాయ వనరులతో జీవించే సీనియర్ సిటిజన్లకు దీంతో ఉపశమనం లభించనుంది. వయసురీత్యా పలు కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వయసురీత్యా ఆరోగ్య పరిరక్షణ మరింత అవసరమయ్యే వీరికి పెరుగుతున్న బీమా ప్రీమియంలు ఆర్థికంగా భారమవుతున్న సంగతి తెలిసిందే.