పేదలు పణంగా బాబు రాజకీయం | Sakshi Guest Column On Chandrababu Politics On Pensioners | Sakshi

పేదలు పణంగా బాబు రాజకీయం

Apr 5 2024 12:47 AM | Updated on Apr 5 2024 12:47 AM

Sakshi Guest Column On Chandrababu Politics On Pensioners

రాజకీయాల్లో  వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది స్ట్రైట్‌ పాలిటిక్స్‌ చేస్తే మరి కొంతమంది నాయకులు వెన్ను పోట్లు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. ఇవి కూడా చర్చనీయాంశమే అయినా... పవర్‌ కోసం కొట్లాట రాజకీయ పార్టీలు, రాజ కీయ ప్రత్యర్ధుల మధ్య ఉండటం వరకు సమర్థించవచ్చు.

కాని స్వార్థం హద్దులు దాటి అధికారం కోసం, ప్రత్యర్ధిని దొంగ దెబ్బ తీయటం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకోవటం,  బలహీన వర్గాల ప్రజలతో చెలగాటం ఆడే కుట్రలు... ఏ మాత్రం సహించ దగినవి కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కూటమి ఇప్పుడు ఇటువంటి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెర తీశారు.
 
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్ర అనారోగ్యగ్రస్థులకు వారి ఇంటి దగ్గరే వాలంటీర్లు పెన్షన్‌ అందించే విధానాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. తన జేబులోని మనిషి, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లు పెన్షన్లను లబ్ధిదారులకు పంచకూడదని ఫిర్యాదు చేయించారు. వీరి ఫిర్యాదుకు అను గుణంగా ఈసీ ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు 66 లక్షల మంది పెన్షనర్లు మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర చరిత్రలో, బాబు హయాంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పండుటాకులు ఎలా పడిగాపులు పడేవారో పత్రికల్లో ఫోటోలతో సహా వార్తలు నిత్యం వస్తూ ఉండేవి. వారం, పది రోజుల పాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది ఆ రెండు వందల రూపాయల పెన్షన్‌ కోసం. పూట గడవని స్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అవ్వా తాతలు అలానే అంతటి కష్టాన్నీ భరించే వారు. కాస్త కాలు చేయి బాగానే ఉన్నవారు సరే. మరి మంచాన పడిన వారు, నాలుగడుగులు కూడా వేయలేని వారు, ఆసరా లేకుండా నిలబడ లేని వారి పరిస్థితిని ఊహించగలమా? 

జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత  లక్షలాది మంది నిస్సహాయులను ఇటువంటి దుఃస్థితి నుంచి బయటపడేశారు. పెన్షన్‌ కోసం మంచం దిగాల్సిన అవసరం రాకుండా సగౌరవంగా వాలంటీర్లే లబ్ధి దారుల ఇళ్ళకు వెళ్ళి అవ్వా, తాతల చేతుల్లో పెట్టే విధంగా వాలంటీర్‌–సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అది కూడా ఫస్ట్‌ తేదీనే, కోడి కూయక ముందే! ఇప్పుడు అక్షరాల 3 వేల రూపాయల పెన్షన్‌ 66 లక్షల మందికి అందు తోంది.

వృద్ధులనే కాదు వికలాంగులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్‌ వంటి తీవ్ర రోగాల పాలైన వారిని కూడ ప్రభుత్వం పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడేందుకు వీరి ఆరోగ్యం సహకరించదు. ఓ వైపు మండుతున్న ఎండలను తట్టుకునే శక్తీ ఉండదు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మంచాన పడిన వారు  కూడా పెన్షన్‌ కోసం సచివాలయం చుట్టూ తిరిగాల్సిన దుఃస్థితి ఏర్పడింది. 

వాలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ఉన్న భయం, ఆక్రోశం ఇవాళ్టిది కాదు. గత రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. పట్టుమని పాతికేళ్లు నిండని ఈ పిల్లలను రెడ్‌ లైట్‌ ఏరియాకు మహిళలను సరఫరా చేసే బ్రోకర్లుగా, హ్యూమన్‌ ట్రాఫికర్లుగా, దొంగలుగా పవన్, చంద్రబాబు మొన్నటి వరకు చిత్రించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి చేసిన మంచి వల్ల ప్రజలంతా జగన్‌కే మళ్లీ పట్టం కడ తారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇంతటి క్రూరమైన క్రీడకు తెర తీశారు. దీని ద్వారా చంద్ర బాబు రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు.

రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మొదటి లక్ష్యం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పండు టాకులనూ, నిస్సహాయులనూ మళ్లీ రోడ్డున పడవేసి పెత్తందారీ, దురహంకారపూరిత ఆనందాన్ని పొందటం రెండో లక్ష్యం. వృద్ధులు, నిస్సహాయులను క్షోభ పెడితే ఆ పాపం ఊరకనే పోదు. ఇది నిజం!
– ఆర్‌ఎస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement