
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంటు అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమావతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళుతున్న ఆ నలుగురు వ్యక్తులూ, ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే.. ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.’’ ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
‘దేవుడి మహిమ అంటే అదీ’ అని వాదించేవాళ్లు..‘వాళ్లు మేకను బలి ఇవ్వాలనుకున్నారు. దేవుడు వాళ్లనే బలి తీసుకున్నాడు’ అనే వాళ్లూ..‘దేవుడు కరుణమాయుడు.. తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు’ అని సూత్రీకరించేవాళ్లూ.. బోలెడు మంది తయారవుతారు.
ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది తప్పుడు వార్త! మరి ఫోటో ఎలా? అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావొచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే.. దాని నెంబర్ ప్లేట్ మాత్రం.. స్ట్రెయిట్ గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫాబ్రికేషన్ లో ఒక లోపం.

తత్వ ఇండియా (#thetatvaindia) అనే బ్లూటిక్ ఉన్న అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడవక ముందే.. ఈ పోస్టును కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు మూడువేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. దాదాపు 30 వేల మంది దీనిని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంతగొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే.. అది కాస్తా తప్పుడు వార్త అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మాట నిజం. కానీ ఈ పోస్టు మాత్రం తప్పు!
వాస్తవాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భేడాఘాట్ చౌకీతాళ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని దుల్హా దేవ్ మహరాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకుని వెళ్లారు. ఆ ఆలయంలో ప్రతీకాత్మకంగా మాత్రమే బలి జరుగుతుంది. బలి ఇచ్చినట్టు గుర్తుగా మేక చెవులను మాత్రం కత్తిరిస్తారు. వీళ్లు ఆ బలి మొక్కుబడిని తీర్చుకుని గోటగావ్ నుంచి జబల్పూర్ కు తిరిగి బయల్దేరారు. చెవులు కత్తిరించిన మేక కూడా అదే వాహనంలో ఉంది. డ్రైవ్ చేస్తూనే బాగా మద్యం సేవించారు.
జబల్‌పూర్ సమీపంలో ఛర్గావాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత.. అదుపు తప్పి వంతెన మీదనుంచి సోమవతి నదిలో పడిపోయింది. ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మేకమాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు ఫోటో ఇది (తెల్ల స్కార్పియో ఉన్నది). వాహనంలో ఉన్న వాళ్లు మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.
సంఘటన నిజంగానే జరిగింది. కానీ దానిని.. తమకు కావాల్సిన రీతిలో వక్రీకరించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు. ఏ రకంగా వక్రీకరించి ప్రచారంలో పెడితే.. వ్యూస్ ఎక్కువగా వస్తాయో.. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు బాగా తెలుస్తుంది. అంత తెలివైన వాళ్లు కాబట్టే.. ఒక్కరోజు కూడా గడవకముందే కోటి వ్యూస్ సంపాదించుకున్నారు.
దీనిని బట్టి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే.. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మకూడదు. కంటికి కనిపించేవి.. చెవులకు వినిపించేవి అన్నీ నిజం కాదు. బ్లూ టిక్ ఉన్నంత మాత్రాన ఆ సోషల్ మీడియా అకౌంట్లు నిజాలు చెప్పే నిజాయితీ ఉన్నవి అనుకోవడానికి కూడా వీల్లేదు. సోషల్ మీడియాలో ఏ సంగతి కనిపించినా.. ముందు దానిని అపనమ్మకంతో చూడాలి. ఇంకాస్త అనుమానం కలిగితే.. ఏదో ఒక రకంగా క్రాస్ చేసుకోవాలి. లేకపోతే.. ఈ తప్పుడు ట్వీట్ ను షేర్ చేస్తూ వెళ్లిన మూడు వేల మంది అమాయకుల్లో ఒకరుగా మనం కూడా మారిపోతాం.
..ఎం.రాజేశ్వరి