
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడం..వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతొ ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదంతా పక్కకి పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.
(చదవండి: 'రేపోమాపో నేను చనిపోతాను.. తల్లిగా అడుక్కుంటున్నా..', 'మూగజీవాల్ని ఏం చేస్తారు?')
సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, యాంకర్ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ.. చెట్లను, జంతువులను కాపాడుకోవాలని కోరారు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత, యాంకర్, నటి అనసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన ఆర్టికల్‌ని పోస్ట్ చేసిన సమంత..బులడోజర్స్ తో 400ఎకరాల్లో చెట్లను నరకటం చాలా బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని.. అడవుల్ని నరుక్కుంటూ పోతే.. ఇప్పటికే ఉన్న దానికంటే.. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ జంతువులు, పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది.
ఇక సోషల్ మీడియా సంచలనం అనసూయ సైతం ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది.