
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ గతేడాది తంగలాన్ మూవీతో అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన మెప్పించింది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ సరసన ది రాజాసాబ్ చిత్రంలో కనిపించనుంది. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయిలో తాను ఓ భయానక అనుభవం ఎదురైందని పేర్కొంది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత గురించి నటి మాళవిక మోహనన్ స్పందించింది.
మాళవిక మోహనన్ మాట్లాడుతూ..'ముంబయిలో ఒక రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణించా. రాత్రి 9 గంటల 30 నిమిషాలు అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ చాలా ఖాళీగా ఉంది. ఆ కంపార్ట్‌మెంట్‌లో మేము తప్ప ఎవరూ లేరు. అదే సమయంలో ఒక వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. అప్పుడు అతడి ప్రవర్తనతో మేమంతా భయానికి గురయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే కొంతమంది ప్రయాణికులు మాకు తోడయ్యారు. అప్పుడే మేమంతా ఊపిరి పీల్చుకున్నాం' అని వెల్లడించింది. అయితే అక్కడ ఉన్న మహిళలకు సురక్షితమా కాదా అనే విషయం అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది.
మాళవిక మాట్లాడుతూ..'నగరం మహిళలకు ఎంత సురక్షితమైనది అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ముంబయి మహిళలకు సురక్షితం అని ప్రజలు చెబుతారు. కాని నేను ఆ అభిప్రాయాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. ఈ రోజు నాకు సొంత కారు, డ్రైవర్ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నన్ను ముంబై సురక్షితంగా ఉందా అని అడిగితే.. నేను అవును అని చెప్పగలను. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు, బస్సులు మరియు రైళ్లలో ప్రయాణించడం, నేను తరచుగా ప్రయాణించడం అదృష్టంగా భావించలేదు. ఆ సమయంలో చాలా ప్రమాదకరంగా అనిపించేది' అని చెప్పుకొచ్చింది.