
మెజారిటీ ఆధారంగా గెలుపు ప్రకటన
49వ రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి, 50వ రౌండ్‌లో ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం మల్లన్న గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు (1,55,095) రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.
మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి« తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 ఓట్లు లభించాయి. అయినా గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు.
48 మందిని ఎలిమినేట్ చేయగా..
ఈ ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన 48 మంది ని ఎలిమినేట్ చేసి, వారికి పడిన మొదటి ప్రాధాన్య ఓట్లలోని రెండో ప్రాధాన్యతను లెక్కించగా వచ్చిన ఓట్లను కలుపుకోగా కాంగ్రెస్ అభ్యర్థి 1,24,899 ఓట్లకు, బీఆర్‌ఎస్ అభ్యర్థి 1,05,524 ఓట్లకు, బీజేపీ అభ్యర్థి 43,956 ఓట్లకు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 30,461 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు.
49వ రౌండ్‌లో అశోక్ ఎలిమినేషన్
గెలుపునకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 49వ రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలోని రెండో ప్రా«ధాన్య ఓట్లను లెక్కించారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 10,383 ఓట్లు రావడంతో ఆయన 1,36, 246 ఓట్లకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి 10,118 ఓట్లు రావడంతో ఆయన 1,16,292 ఓటకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 4,918 ఓట్లు రాగా ఆయన 48,874 ఓట్లకు చేరుకున్నారు.
50వ రౌండ్‌లో ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్
గెలుపునకు అవసరమైన ఓట్లు అప్పటివరకు ఎవరికీ రాకపోవడంతో 50వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన 48,874 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తీన్మార్ మల్లన్నకు 14,278 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థికి 19,510 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 1,50, 524 ఓట్లకు చేరుకోగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓట్లు 1,35,802 చేరుకున్నారు.
అయినప్పటికీ గెలుపు కోటాకు 4,571 ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మల్లన్నకు రాకేశ్‌రెడ్డి కంటే 14,722 ఓట్లు అధికంగా (మెజారిటీ) ఉన్నాయి. దీంతో రాకేశ్‌రెడ్డిని ఎలిమినేట్ చేయకుండానే, మల్లన్నకు అధిక ఓట్లు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆమోదంతో మల్లన్న గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలో 10 వేల మంది గ్రాడ్యుయేట్లు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వ లేదు. మరో 5 వేలమంది గ్రాడ్యుయేట్లు అశోక్‌కు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వలేదు.