Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Amaravati Capital construction works scam1
ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు

సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్‌) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్‌ స్టార్‌ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్‌ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్‌ బిల్డింగ్‌కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–­రూ.4,500కు మించ­దని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చ­ర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మా­ణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివా­లయం (ఐదు ఐకానిక్‌ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల నివాసాల (క్వార్టర్స్‌) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్‌ కేపిటల్‌ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్‌లో పేర్కొన్నారు. కానీ.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్‌ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపు­లతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థ­లకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తి­గత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాల­యం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్‌ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐదు ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ృజెనిసిస్‌ ప్లానర్స్‌ృడిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్‌లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తు­లతో.. ఐదో టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్‌ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్‌ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Mann ki baat PM Modi Addresses Operation-Sindoor2
‘ఆపరేషన్‌ సింధూర్‌’ గర్వకారణం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’లో భారత సైనికులు చూపిన శౌర్యపరాక్రమాలు యావత్‌ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ 122వ ఎపిసోడ్‌(మే 25)లో ప్రధాని నరేంద్ర మోదీ తన మసుసులోని మాటను వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, పలు కుటుంబాలు దీనిని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతమయ్యాక దేశంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం బీహార్‌లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడినవారు, కుట్రదారులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని కలచివేసిందన్నారు.ఉగ్రవాదంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారని ప్రధాని గుర్తుచేశారు. కాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు రాకతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. ఈ గ్రామం మావోయిస్టుల హింసకు గురైందని, గ్రామానికి తొలిసారిగా బస్సు చేరుకున్నప్పుడు ఘనంగా స్వాగతించారని అన్నారు. గత మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏప్రిల్, మే నెలల ప్రాముఖ్యతను తెలియజెప్పారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) చేసిన త్యాగాలను వివరించారు.ఇది కూడా చదవండి: Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..

Congress Jagga Reddy Sensational Comments On Kavitha Letter3
కేసీఆర్‌ ఉంటేనే కేటీఆర్‌, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్‌ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్‌లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.​కేసీఆర్‌తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్‌ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్‌గా ఎదిగారు. కేసీఆర్‌ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్‌లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్‌ చేశారు.

IPL 2025 PBKS VS DC: Shreyas Iyer Bags Unwanted Record As Captain4
IPL 2025: శ్రేయస్‌ ఖాతాలో చెత్త రికార్డు

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతాలో అనవసర రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌ చరిత్రలో 200 ప్లస్‌ లక్ష్యాలను డిఫెండ్‌ చేసుకునే క్రమంలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.శ్రేయస్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు 200 ‍ప్లస్‌ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. శ్రేయస్‌ తర్వాత ఈ చెత్త రికార్డును ఎంఎస్‌ ధోని, ఫాఫ్‌ డుప్లెసిస్‌, శుభ్‌మన్‌ గిల్‌ సంయుక్తంగా షేర్‌ చేసుకున్నారు. వీరు ముగ్గురు తలో మూడు సందర్భాల్లో 200 ‍ప్లస్‌ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఎదురైన పరాభవం తర్వాత శ్రేయస్‌ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ సారథ్యం వహించిన పంజాబ్‌.. 207 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ మరో 3 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.శ్రేయస్‌ సారథ్యంలో 200 ప్లస్‌ టార్గెట్‌ను నిలువరించుకోలేకపోయిన సందర్భాలు..2024 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 223 పరుగులు (కేకేఆర్‌ కెప్టెన్‌గా)2024 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 261 పరుగులు (కేకేఆర్‌ కెప్టెన్‌గా)2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 245 పరుగులు (పంజాబ్‌ కెప్టెన్‌గా)2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 206 పరుగులు (పంజాబ్‌ కెప్టెన్‌గా)జట్ల విషయానికొస్తే.. 200 ప్లస్‌ లక్ష్యాలను అత్యధిక సార్లు నిలువరించుకోలేకపోయిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఏడు సందర్భాల్లో 200 ప్లస్‌ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. పంజాబ్‌ తర్వాత ఆర్సీబీ, సీఎస్‌కే అత్యధిక సార్లు ఈ అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.200 ప్లస్‌ లక్ష్యాలను అ‍త్యధిక సార్లు కాపాడుకోలేకపోయిన జట్లు..పంజాబ్‌- 7ఆర్సీబీ- 6సీఎస్‌కే- 5కేకేఆర్‌- 4గుజరాత్‌- 4రాజస్థాన్‌- 2ఎస్‌ఆర్‌హెచ్‌- 2ఢిల్లీ- 2ఎల్‌ఎస్‌జీ- 2నిన్నటి పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 200 ప్లస్‌ లక్ష్యాన్ని సెట్‌ చేసిన కూడా కాపాడుకోలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ ర‌హ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వ‌ద్ద పెవిలియ‌న్‌కు పంపాడు.అయితే, మ‌రో ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దారు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 ప‌రుగులు సాధించాడు. కానీ శ్రేయ‌స్ అవుటైన త‌ర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మ‌ళ్లీ నెమ్మ‌దిగా సాగింది.నేహాల్ వ‌ధేరా (16), శ‌శాంక్ సింగ్ (11) నిరాశ‌ప‌ర‌చ‌గా.. మార్క‌స్ స్టొయినిస్ మెరుపుల‌తో పంజాబ్ 200 ప‌రుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 ప‌రుగులతో రాణించాడు. ఆఖ‌ర్లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 ప‌రుగుల‌తో స్టొయినిస్‌తో క‌లిసి నాటౌట్‌గా నిలిచాడు.ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ ర‌హ్మాన్ మూడు వికెట్లు తీయ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, కుల్దీప్ యాద‌వ్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం 207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడ‌టంతో ఐదు ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులు చేసింది. అయితే, ఆరో ఓవ‌ర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది.ఆ త‌ర్వాతి ఓవ‌ర్ల‌లో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుట‌య్యాడు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించ‌గా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అట‌ల్ (22) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఈ క్ర‌మంలో ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దే బాధ్య‌త తీసుకున్న స‌మీర్ రిజ్వీ ధ‌నాధ‌న్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 ప‌రుగులు చేసిన అత‌డు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల సాయంతో 58 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఆఖ‌ర్లో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ 18 ప‌రుగుల‌తో అత‌డికి తోడుగా నిలిచాడు. ఈ క్ర‌మంలో మ‌రో మూడు బంతులు మిగిలి ఉండ‌గానే ఢిల్లీ ల‌క్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్‌, ప్ర‌వీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై క‌న్నేసిన పంజాబ్‌ ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలోనే కొన‌సాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్ల‌తో ఉన్న పంజాబ్ ఆఖ‌రిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై గెలిస్తేనే టాప్‌-2లో నిలిచే అవ‌కాశం ఉంటుంది.

KTR Respond On Miss England Milla Magee Allegations5
మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్‌ డిమాండ్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్‌ వరల్డ్‌–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది!. మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ.. మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. మిల్లా మాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాము. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే.దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss WorldYou are a very strong woman, Milla Magee and I am truly sorry you had to go through this in our state of TelanganaTelangana has a rich culture of… pic.twitter.com/c7Gla3x3yI— KTR (@KTRBRS) May 25, 2025ఇదిలా ఉండగా, అంతకుముందు.. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్‌ పర్పస్‌కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్‌ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్‌ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్‌ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’ అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్‌ వరల్డ్‌ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్‌ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’ అని మిల్లా మాగీ చెప్పింది.

Zomato rider story From Rs 1 25 lakh salary to delivery duty6
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం..

జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్‌ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..ఒక ఫుడ్‌ డెలివరీ రైడర్‌ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్‌ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్‌ గాంధీ డెలివరీ రైడర్‌ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.శ్రీపాల్ గాంధీ సబ్‌వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్‌ డెలివరీ రైడర్‌ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్‌ చూడగానే అందులో శాండ్‌విచ్‌ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్‌ అయ్యాయని శ్రీపాల్‌ గుర్తించి డెలివరీ రైడర్‌కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్‌ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్‌ సబ్‌వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్‌ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.ఎంత వినయం?ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్‌కు వెళ్లి మిస్‌ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్‌వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదంరైడర్ తన గతం గురించి శ్రీపాల్‌ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా అవకాశమిచ్చింది.తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్‌తో ఫుడ్‌ డెలివరీ రైడర్‌ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్‌ గాంధీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్‌ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్‌ వివరించారు."ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు.

Delhi Receives Heavy Rain Roads Flooded7
ఢిల్లీలో కుండపోత వర్షం.. నీటి మునిగిన కార్లు, బస్సులు

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు అధికారులు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు విరిగిపోయి పడిపోవడంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా చాలా రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి. ఇక, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి.VIDEO | Delhi rains: The road leading Terminal 3 of IGI Airport is still waterlogged causing inconvenience to travellers. #Delhi #DelhiWeather #Delhirains pic.twitter.com/01O0Q018Dv— Press Trust of India (@PTI_News) May 25, 2025ఇదిలా ఉండగా.. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి కలిపే అండర్‌ పాస్‌ రోడ్డుపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో, డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Bengaluru, Mumbai, Delhi, divided by language, united by turning into river rafting spots within 15 minutes of rain.This is an underpass in Delhi Cantt. Doesn’t seem like an old construction. Wonder why we don’t focus much on drainage and stormwater management. pic.twitter.com/NJ6wqfXJnx— THE SKIN DOCTOR (@theskindoctor13) May 25, 2025 Congratulations delhi This is the condition of Modi's Triple Engine project. Delhi drainage were choked.... in the first rain.@AtishiAAP @Saurabh_MLAgk @AamAadmiParty pic.twitter.com/KapywCZEwc— Himanshu Chauhan (@Himanshu_Aap_) May 24, 2025DELHI IN A DEPLORABLE CONDITION AFRET HEAVY RAINS⚡️⛈️Roads waterlogged even the highways, underpass blocked, even the lamp posts broken & fallen, blocking the roads; are common scenarios.#Delhi #DelhiWeather #DelhiNCR #delhirain pic.twitter.com/6me4kpSbMn— Barbarik (@Sunny_000S) May 25, 2025रात को आए तूफान में सफदरजंग एयरपोर्ट पर अधिकतम 82 किलोमीटर प्रति घंटे तक की रफ्तार वाली हवाएं चलीं।#DelhiRains pic.twitter.com/eex2EgTNmh— Hemant Rajaura (@hemantrajora_) May 25, 2025

AIMIM MP Asaduddin Owaisi Comments On Pakistan8
పాకిస్తాన్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మనామా: దాయాది దేశం పాకిస్తాన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్‌లో ఎంపీ అసద్‌ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్‌ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్‌ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్‌ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్‌ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్‌ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్‌ రెచ్చగొట్టే ప్రయ‍త్నాలు చేస్తున్నప్పటకీ భారత్‌ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్‌ వల్లే జరుగుతున్నాయి.మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc— ANI (@ANI) May 24, 2025ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్‌ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్‌ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్‌ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

Heart Palpitations: Symptoms Causes And Treatment9
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్‌ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్‌ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.పాల్పిటేషన్స్‌ అంటే...? గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్‌లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్‌ లేదా రేసింగ్‌గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్‌) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్‌కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే... గుండెదడ (పాల్పిటేషన్‌ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు. తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.గుండె లయ తప్పడం (అబ్‌నార్మల్‌ రిథమ్‌ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్‌ నోడ్‌ అనే చోట ఎలక్ట్రిక్‌ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్‌ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్‌లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్‌ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది. దాంతో గుండె రిథమ్‌ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్‌ను పంపే క్యాథెటర్‌ ప్రోసిజర్స్‌తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్‌లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్‌ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్‌గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్‌ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్‌ ఫిబ్రిలేషన్‌ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్‌ అరెస్ట్‌ లేదా పక్షవాతం (స్ట్రోక్‌) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్‌ కార్డియాక్‌ డెత్‌) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్‌ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్‌) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.ఆధునిక కార్డియాక్‌ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక... కార్డియాక్‌ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్‌ రిథమ్‌) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్‌ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్‌ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్‌ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు. ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్‌ కార్డియో–వెర్టర్‌ డీఫిబ్రిలేటర్స్‌ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్‌ షాక్‌ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి. చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్‌ సిగ్నల్స్‌)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్‌ బెల్‌లా పనిచేస్తుందని చెప్పవచ్చు. (చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్‌ చేస్తారంటే..?)

I Dont work for Government Tharoor Praises Indias Operation10
ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్

న్యూయార్క్: ‘నేను ‍ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్‌ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్‌ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్‌(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్‌ భారత కాన్సులేట్‌లో ప్రసంగించారు.పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్‌ పేర్కొన్నారు.పహల్గామ్‌లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement