
ఉట్నూర్(ఖానాపూర్): పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజా వ్యవస్థ నిర్మాణంగా మారినప్పుడే సత్ఫలితాలు వస్తాయని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతీ పోలీసు ముందుకు సాగాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా అదివారం నార్త్ జోన్ డీఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్‌లతో కలిసి ఆయన ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో పర్యటించారు. అనంతరం నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజలకు దగ్గర అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతి పోలీసులు ముందుకు సాగాలన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండేట్లు విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే తరహాలో సిబ్బంది పని తీరు ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఉట్నూర్ ఏజెన్సీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో పోలీసుల తీరు అభినందనీయమన్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, నిర్మల్, కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీలు దక్షిణమూర్తి, గోద్రు, డీఎస్పీలు వెంకటేశ్, నర్సింహారెడ్డి, రాములు, సాంబయ్య, సత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment