ఉద్యోగం రాలేదని ఉసురు తీసుకున్నాడు.. | Unemployed man commits suicide | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని ఉసురు తీసుకున్నాడు..

Published Sat, Jan 20 2018 7:18 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Unemployed man commits suicide - Sakshi

ఓ యువకుడు ఉన్నత చదువులు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేటు ఫైనాన్స్, చిట్‌ ఫండ్స్‌ సంస్థల్లో పని చేస్తూనే తనకిష్టమైన పోలీస్‌ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు సార్లు ఎస్సై ఉద్యోగానికి పరీక్షలు రాసి కొన్ని మార్కుల తేడాతో విఫలమయ్యాడు. అనంతరం ఇక తనకు ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెందిన ఆ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు, కుటుంబీకులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

మంచిర్యాల క్రైం: మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు చెందిన  వినోద్‌కుమార్‌(31) ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మేదరివాడలోని వైశ్య భవన్‌ సమీపంలో నివాసం ఉంటున్న వంగపెల్లి సాగర్‌రావు, విజయలక్ష్మీ దంపతుల కుమారుడు వినోద్‌కుమార్‌. ఎంబీఏ పూర్తి చేసి గత కొంత కాలంగా గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే తపన, పోలీస్‌ ఉద్యోగమంటే మక్కువతో రెండు సార్లు ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నాలు చేశాడు. రాత పరీక్షలో రెండు మార్కుల తేడాతో ఉద్యోగం ఆ యువకుడిని వరించలేదు. అప్పటి నుంచి తనకు ఉద్యోగం రాదేమోనని వినోద్‌ మనస్తాపం చెందుతున్నాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. వినోద్‌ తల్లిదండ్రులు రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వినోద్, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌ ఇంటివద్దనే ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తమ్ముడు బయటకు వెళ్లడంతో వినోద్‌ ఉరేసుకున్నాడు.

గోప్యంగా ఉంచేందుకు యత్నం
వినోద్‌ ఆత్మహత్యను గోప్యంగా ఉంచేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆత్మహత్య చేసుకున్న విషయం శుక్రవారం ఉదయం వరకు ఎవరికీ తెలియకుండా ఉంచారు. వినోద్‌ తమ్ముడు శ్రావన్‌ వినోద్‌ను కాపాడే ప్రయత్నంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే వినోద్‌ మృతి చెందాడని వైద్యులు ద్రువీకరించారు. ఆత్మహత్యను గోప్యంగా ఉంచి కుటుంబీకులు శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు సిద్ధం చేశారు.

ఆగిన అంత్యక్రియలు
వినోద్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న సీఐ మహేశ్, ఎస్సైలు శ్రీనివాస్‌ యాదవ్, కే.శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకుని వినోద్‌ అంత్యక్రియలను నిలిపివేశారు. కుటుంబసభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వినోద్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం చేసేందుకు  కుటుంబ సభ్యులు నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement