పల్లెసీమపై సంక్రాంతి సంతకం | Huge celebration at villages of AP | Sakshi
Sakshi News home page

పల్లెసీమపై సంక్రాంతి సంతకం

Published Sun, Jan 14 2018 3:31 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

Huge celebration at villages of AP - Sakshi

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో ముగ్గులు వేస్తున్న మహిళలు

సాక్షి, అమరావతి: సంప్రదాయానికి మారుపేరైన సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్లలో ఒక కొత్త వెలుగు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ జనుల మదిలో వెలుగులు పూయించే సమయం...  చలిపులి ధాటికి దుప్పట్లో  ముసుగుతన్నిన పల్లెలిప్పుడు పండుగ సంబరాలు జరుపుకుంటున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాల సమయాన పురివిప్పి ఆడే నెమళ్లలా పులకిస్తున్నాయి.  ఆత్మీయులు, రక్తసంబంధీకుల రాకతో పెద్దల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులతో పల్లెలు ఇపుడు కళకళలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల్లాగే జీవన శైలిలో చోటుచేసుకుంటున్న వింత పోకడలతో పండుగ సంబరాలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. 

దూరం భారమైనా...దగ్గరవాలనే తపన 
చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల స్థిరపడ్డారు. వేలాది మంది అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్,సింగపూర్‌లో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వీరంతా మూడు రోజుల పండుగ కోసం పల్లెదారి పట్టారు. హైదరాబాద్‌ నుంచే వేలమంది రాష్ట్రంలోని సొంత ఊర్లకు తరలారు. బస్సులు, రైల్వేస్టేషన్లు వారం రోజులుగా కిటకిటలాడాయి. ఎంత ఖర్చయినా సరే సంక్రాంతికి రావాల్సిందే. అత్మీయతలు, అనుబంధాలు పెనవేసుకోవాల్సిందే. ఈ పండుగ ఏ దేవుడికీ సంబంధించినది కాదని, అందరినీ కలిపే ఒక వేడుకని విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఎం.ఎ.మోహన్‌రావు చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లను చూసి ఆయన మురిసిపోతున్నారు. 

ఆత్మీయల కోసం తపన 
ఇంటినిండా బంధుగణం ఉందంటే కోట్లున్నా అంత సంతోషముండదు. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం చాలామంది పట్టణాలకు అక్కడ్నుంచి వీలైతే విదేశాలకూ వెళ్లారు. చాలామందికి డబ్బు సంపాదిస్తున్నా ఆప్యాయతలు లేక పలకరింపు కోసం తపిస్తున్నారు. ఆత్మీయ పలకరింపులు, అనురాగ బంధాల మేళవింపులతో ఏడాదికొక్కసారైనా రాములోరి గుడిపంచన కూర్చుని మనసు విప్పి మాట్లాడే మాటలు కాలిఫోర్నియా, న్యూయార్క్‌లో చూసిన బహుళ అంతస్థుల మేడలకన్నా మిన్న. సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నామని కర్నూలు జిల్లా సంజామలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు.  ‘‘మా చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఎంతో సందడి. గంగిరెద్దుల సందడి, అక్షయ పాత్రతో హరిదాసు పాటలు, గంటలతో జంగాల పొగడ్తలు ఉండేవి. ఇళ్ల ముందు పోటీలు పడి ముగ్గులు పెట్టేవాళ్లం. అంత సందడి ఇపుడు లేదు.’’ అని శ్రీకాకుళం జిల్లా కె.కెరాజపురానికి చెందిన శంభాన వెంకటనారాయణమ్మ అన్నారు. 
 
పనిలో పనిగా పెళ్లిచూపులు కూడా.. 
ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు సంక్రాంతికి ఇంటికొస్తారు. నిజానికి ఇప్పుడు ముహూర్తాలు లేకున్నా  పెళ్లి చూపులు మాత్రం కానిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సుధీర్‌కు ఇలా సంక్రాంతికి వచ్చినప్పుడే పెళ్లిచూపులు జరిపి తరువాత వివాహం చేశారని వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం మబ్బుచింతలపల్లెకు చెందిన ఎల్‌.రామసుబ్బారెడ్డి చెప్పారు.  
 
పల్లెల్లో ఆటపాటలు, పందేల సందడి.. 
విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలో భోగి రోజు నుంచి ప్రారంభమయ్యే తీర్థాల సందర్బంగా యడ్ల బండ్ల పోటీలు, పోతుల పందాలు, సంగిడిరాళ్ల పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వినోదం విషయానికొస్తే పొట్టేలు పందేలు ఒక్కటే చెప్పుకోదగినవి. ఇందుకు అనుమతి లేకపోవడంతో వంగర, వీరఘట్టం మండలాల్లో, విజయనగరం సరిహద్దుల్లో గుట్టుగా నిర్వహిస్తున్నారు. పచ్చని కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల కోసం రాష్ట్ర నలు మూలల నుంచి తరలివస్తారు. పంటచేలు, కాలవలను దాటుకుని వచ్చే ప్రభలను చూసేందుకు జనం పోటెత్తుతారు. ముఖ్యంగా కొబ్బరి కేంద్రమైన అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం వెనుక నాలుగున్నర దశాబ్ధాలకుపైగా చరిత్ర ఉంది.

ఎటువంటి ఆలయం లేని ఇక్కడ 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. కర్నూలు జిల్లా జొహరాపురంలో నిర్వహించే బండలాగుడు పోటీలు అందరిలో ఉత్సాహాన్ని నింపుతాయి. అహోబిలంలో జరిగే పారువేట ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణ. ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, హరివరం తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చే పల్లె వాసులు ఈ పారువేట ఉత్సవాల్లో పాల్గొంటారు. గిరకబండి పోటీలు, ఎద్దులతో బండలాగుడు పోటీలలో పల్లె వాసులు పాల్గొని ఆనందంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా తీర్థాల్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఒకప్పుడు గోదావరి జిల్లాలకే పరిమితమైన కోడిపందేలు ఇపుడు విశాఖ గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. ముత్యాలమ్మపాలెం బీచ్‌ మొదలుకొని భీమిలి బీచ్‌ వరకు పతంగుల పండుగ నిర్వహిస్తున్నారు. 
 
భారీగానే పండుగ వ్యాపారం 
సంక్రాంతి పండగ నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారం బాగానే జరిగిందని అంటున్నారు. వస్త్ర వ్యాపారానికి ఉత్తరాంధ్రలోనే పేరెన్నికగన్న విజయనగరంలో సుమారు రూ.170 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల వస్త్ర మార్కెట్‌కు కేంద్రమైన రాజమహేంద్రవరం, కాకినాడ, ద్వారపూడి, ఇతర పట్టణాల్లో గడిచిన ఐదారు రోజుల్లో సుమారు రూ.80 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. నోట్ల కష్టాలు లేకుంటే వ్యాపారం ఇంకా బాగా జరిగేదని అంటున్నారు. కర్నూలుజిల్లాలో పండుగ ముగ్గుల రంగుల అమ్మకాలే రూ.2 కోట్ల మేర జరిగినట్టు తెలుస్తోంది. చిత్తూరుజిల్లాలో ఈ ఏడాది వస్త్ర దుకాణాలు, గృహోపకరణాలు, బంగారు, నిత్యావసర సరుకులు ఇలా మార్కెట్‌లో రూ.230 నుంచి రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 
 
ఇప్పుడు మాట్లాడటం అంటే మద్యమే 
తరాలు మారినంత మాత్రాన తలరాతలు మారతాయా? అంటారు. కానీ అంతరాలు మాత్రం ఖచ్చితంగా మారుతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతికి దూరప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆటపాటలతో, ఆత్మీయ పలకరింపులతో సందడి చేసేవారు. అంతా చావిడి వద్ద గుమికూడేవారు. ఇప్పుడు పదిమంది కుర్రాళ్లు కలవాలంటే మద్యం సీసా వారధిగా మారింది. ఆటవిడుపు అంటే మద్యం అన్నట్లుగా మారింది. అన్నాదమ్ములు, అల్లుళ్లు పక్కపక్కనే కూర్చుని చీర్స్‌ చెప్పుకుంటున్నారు. కొన్నిచోట్ల కనుమరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే మద్యం ప్రవాహం రాత్రి పదిగంటల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. బలాబలాలు బేరీజు వేసుకోవటానికి మద్యపానాన్ని కొలబద్ధగా మార్చుకోవటం కొత్త ట్రెండ్‌కు అద్దం పడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement