
అనంతపురం సప్తగిరి సర్కిల్ : విజయవాడ దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేవలం కొందరి లబ్ధి కోసం ప్రజలకు, రాష్ట్రానికి ఏర్పడే నష్టం గురించి తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన రీతిలో తాంత్రిక పూజలు నిర్వహించడం దారుణమన్నారు.
పవిత్రమైన దేవాలయంలో అపచారం జరిగితే దానివల్ల జరిగే అనర్థాలను నివారించేందుకు పీఠాధిపతులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని.. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్వామీజీ హెచ్చరించారు. ఈ ఘటనపై పెద్దలను వదిలి అర్చకులను దోషులను చేయడం బాధాకరమన్నారు. తాంత్రిక పూజలు నిర్వహించిన వారిని వదిలిపెట్టి బ్రాహ్మణులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. నేడు బ్రాహ్మణుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వారి స్థలాలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాంత్రిక పూజల మలినాన్ని కడిగి సంప్రోక్షణ చేయాలని స్వామీజీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment