కియా
కియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏకంగా బోర్డులు పెట్టేస్తున్నారు. భర్తీ ప్రక్రియ మాకే అప్పగించారంటూ ఏజెన్సీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కొరియా భాష నేర్పిస్తామనే ముసుగులో శిక్షణ కేంద్రాల్లోనూ ఉద్యోగాల దందా సాగుతోంది. పీజీలు.. డిగ్రీలు చదివి ఉపాధి వేటలో విసిగిపోయిన నిరుద్యోగ యువత కియా మాయలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇప్పుడు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఎలక్ట్రికల్.. ఫిట్టింగ్.. సూపర్‌వైజర్లు.. అటెండర్లు.. క్లర్క్ పోస్టుల పేరుతో సాగుతున్న దందా యువకుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది.
నాకు ‘కియా’లో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. నెలకు జీతం రూ.20వేలు అన్నారు. తర్వాత జీతం పెరుగుతుందన్నారు. ఉద్యోగం ఇప్పించేందుకు రూ.లక్ష తీసుకున్నారు. సీఎం భూమి పూజ చేసిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెబుతున్నారు. ఆరా తీస్తే ఉద్యోగాల భర్తీ పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని.. ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని తెలిసింది. మధ్యవర్తులను నిలదీస్తే ఉద్యోగం ఇప్పిస్తామని, గొడవ చేస్తే పైసా కూడా వెనక్కు ఇవ్వమని బెదిరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కొరియాకు చెందిన ‘కియా’ కార్ల పరిశ్రమ పెనుకొండ వద్దనున్న అమ్మవారిపల్లి సమీపంలో ఏర్పాటవుతోంది. దీని కోసం 600 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించి ‘కియా’కు అప్పగించింది. ఈ భూమిని చదును చేసేందుకు రూ.178 కోట్లతో ఏపీఐఐసీ టెండర్లు ఆహ్వానించగా.. ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుని పనులు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీఐఐసీకి సంబంధించిన నిధులతోనే పనులు చేపడుతున్నారు. కియాకు సంబంధించి పూర్తిస్థాయిలో పనులు వేగం పుంజుకోని పరిస్థితి. ఈనెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కియాకు భూమిపూజ చేయించి పనులు ప్రారంభించాలని కియా యాజమాన్యం భావిస్తోంది. ఆ తర్వాత పనులు మొదలవుతాయి.
అప్పుడు వాచ్‌మన్‌లు, కూలీల నియామకానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కర్మాగారం నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో కొరియా నుంచి ఇంజనీర్లు, వర్కర్లు చేరుకున్నారు. భూమి పూజ తర్వాత.. ఫ్యాక్టరీ పూర్తయ్యే దాకా కొరియన్లే పనులు చేసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావాలంటే వేగంగా చేసినా రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత కూడా ప్రాధాన్య విభాగాల్లోని ‘స్కిల్డ్ లేబర్’లో అధికశాతం కొరియన్లు ఉండే అవకాశం ఉంది. ఇక్కడి వారికి అతి తక్కువగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. అసలు ఇప్పటి వరకు కియా ఎలాంటి ఉద్యోగ నియామక ప్రకటనా ఇవ్వలేదు. భర్తీకి ఉపక్రమించలేదు. కేవలం కియా పేరు చెప్పుకుని కొందరు దందాకు పాల్పడుతున్నారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ
కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ మొదలైన తర్వాత యాజమాన్యం తమకు అవసరమైన ఉద్యోగులను కలెక్టర్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. విభాగాల వారీగా ఏ శాఖకు ఎంతమంది అవసరమవుతారు? విద్యార్హత? అనుభవాలను బట్టి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో కూడా మొదటి ప్రాధాన్యత పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన వారికి ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వృతి నైపుణ్యాల ఆధారంగా కంపెనీ విధివిధానాల ప్రకారం భర్తీ జరుగనుంది. ఇదంతా తెలియని కొందరు నిరుద్యోగులు ఉద్యోగంపై ఆశతో దళారులను నమ్మి మోసపోతున్నారు.
పీజీ చేసి ఖాళీగా ఉన్నా. నాకు సూపర్‌వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. రూ.2లక్షలు ఇవ్వాలరు. ఇందులో అక్కడ ఉద్యోగాల భర్తీ పర్యవేక్షించే అధికారికి రూ.1.50లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అడ్వాన్స్‌గా రూ.70వేలు ఇచ్చినా. ఉద్యోగం అంటే ఆశతో డబ్బులు ఇచ్చాం. అయితే కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ మొదలు కాలేదని తెలిసింది. రాద్ధాంతం చేస్తే ఇచ్చిన డబ్బులు రావేమోనని భయమేస్తోంది. – రాకేశ్, రాప్తాడు
Comments
Please login to add a commentAdd a comment