ర్యాలీ చేస్తున్న అఖిలపక్షం నాయకులు
అనంతపురం టౌన్: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా అడ్డుపడితే వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు చంద్రబాబు ప్రభుత్వానికి చరమ గీతం పాడుతారని అఖిల పక్షం నాయకులు హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది రాజారెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు న్యాయవాదులతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కిల్‌లో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీభాగ్ ఒడంబడిక మేరకు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతో 1953నుంచీ రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణ నివేదించినా టీడీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ వాసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మీసాల రంగన్న, వైవీ శివారెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్ గిరిజమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనీల్‌కుమార్, వాసిగేరి నాగ్, సతీష్, సీపీఐ నాయకులు శ్రీరాములు, అల్లీపీరా, రమణ, జాన్సన్, రాజేష్, వరలక్ష్మీ, జయలక్ష్మీ సీపీఎం నాయకులు రామిరెడ్డి, వెంకటనారాయణ, కాంగ్రెస్ నాయకులు దాదా గాంధీ, కేవీ రమణ, అమీర్‌తోపాటు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బీసీ నాగరాజు పాల్గొన్నారు.
నిరవధిక నిరాహార దీక్ష భగ్నం
అనంతపురం టౌన్: రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది రాజారెడ్డి నాలుగురోజులుగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. త్రీ టౌన్ ఎస్‌ఐలు రవిశంకర్‌రెడ్డి, కాంత్రికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి సాయంత్రం 4.30 గంటల సమయంలో దీక్ష శిబిరం నుంచి రాజారెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment