0/100.. జన్మభూమి | 0/100 .. Janmabhoomi | Sakshi
Sakshi News home page

0/100.. జన్మభూమి

Published Mon, Nov 17 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

0/100.. జన్మభూమి

0/100.. జన్మభూమి

తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో కనీస మార్కులు సంపాదించలేకపోగా, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. రెండు విడతలుగా సాగినప్పటికీ కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే పరిమితం కావడంతో ప్రజల మన్ననలు పొందలేకపోయింది.

ప్రధానంగా పింఛన్ల కత్తిరింపు, రేషన్ కార్డుల తొలగింపు వంటి చర్యలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కమిటీల పేరిట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు ఆ పార్టీకి చెరగని మచ్చగా మిగిలాయి.
 
గుంటూరు: ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో, ప్రజల భాగస్వామ్యంతో అని చెబూతూ ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం అంతటా రసాభాసగానే ముగిసింది. వేదికలను తెలుగుదేశం నాయకులు ఆక్రమించడంతో ప్రభుత్వం కార్యక్రమం కాస్తా పార్టీ సమావేశాలుగా మారాయనే విమర్శలు జన్మభూమి జరిగిన అన్ని చోట్లా వినిపించాయి.

►అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు, హుదూద్ తుపాను సంభవిం చడంతో తిరిగి నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రెండు విడతలుగా జిల్లాలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా 433 వార్డులు, 1011 గ్రామ పంచాయతీల్లో జన్మభూమి సభలు జరిగినా ఎక్కడా ప్రయోజన కలిగిందనే మాటే వినిపించలేదు.

►  ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడం వల్ల  వివిధ పనులపై అక్కడకు వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు.

► జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కేవలం పింఛన్లు పంపిణీ,దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కావడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు.

ఫించన్ల పంపిణీకే పరిమితం...

జిల్లాలో కమిటీల పేరుతో దాదాపు 53,095 పింఛన్లు తొలగించారు. 34,324 వృద్ధాప్య, 15,349 వితంతు, 860 అభయాస్తం, 1540 వికలాంగులు, 102 కల్లు గీత పింఛన్లు తొలగించారు. ఆధార్ అనుసంధానంతో లక్షకు పైగా రేషన్ కార్డులను తొలగించారు. అన్నిరకాల పింఛన్ల కింద  రూ.19.85 కోట్లను పంపిణీ చేశారు.

వైద్య శిబిరాలకు స్పందన అంతంత మాత్రమే...

►జన్మభూమి సభల్లో వైద్య శిబిరాలను నిర్వహించి 1,41,831 మందికి మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల కోసం 1,42,441 మంది రిజిస్టర్ చేయించుకొన్నారు.

► 8,380 మంది కంటి అద్దాలు, 3,819 మందికి కంటి ఆపరేషన్లు కోసం సిఫార్సు చేశారు. 1521 మందిని ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద వైద్యసేవలకు సిఫారసు చేశారు.

► 2,237 మంది గర్భిణులు, 2,472 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వైద్య సేవలు అవసరమని నిర్ధారించారు.

► ప్రభుత్వం ఆదేశించినా పశువైద్య శిబిరాల్లో నట్టల నివారణ మందులు పంపిణీ చేయలేదు. 1261 శిబిరాలు నిర్వహించి 97,943 పశువులకు వైద్య చికిత్సలు అందించారు.

పొలం పిలువా లేదు..బడి రమ్మనా లేదు ..

పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. పొలాల్లోకి వెళ్లి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చింది అంతంత మాత్రమే. 14,682 మంది రైతులకు భూసార పరీక్షలకు సంబంధించిన కార్డులు అందజేశారు. 5,801 రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. 34,643 మంది సభ్యులను గుర్తించారు. పొలం బడికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.

►బడి పిలుస్తోంది... ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు 4,354 మంది పిల్లలను నమోదు చేశారు. బడిబయట ఉన్న పిల్లలను 3084 మందిని గుర్తించారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న 66,631 మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు.

►పేదరికంపై గెలుపు.. ఈ కార్యక్రమంలో దాదాపు 67,515 గ్రూపులకు వివిధ పనులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 15,647 మంది యువకులకు శిక్షణ ఏర్పాటు చేశారు.

స్వచ్ఛాంధ్ర

ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,10, 248 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద 2,298 హార్వెస్టింగ్ స్ట్రక్చర్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 76,737 మొక్కలు నాటారు. 1756 ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.

520 మంది మత్స్యకారులు బోట్లు, వలల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 5018 మంది నీటి కుంటల్లో వదిలేందుకు చేపపిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.
 
గ్రామీణ ప్రాంతాల నుంచి

 
వచ్చిన దరఖాస్తులు:            1,17,289
పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు :          59,246
మొత్తం దరఖాస్తులు    :         1,76,535
 
రెండో కన్ను పోతే పింఛన్ ఇస్తామంటున్నారు

నాకు ఒక కన్ను లేదు. గతంలో పింఛన్ వచ్చేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ తీసేశారు. ఇప్పుడేమో రెండు కళ్లు పోయినవారికే పింఛను ఇస్తామంటున్నారు. పింఛన్ కోసం రెండో కన్ను పోగొట్టుకోవాలా? ఈ జన్మభూమి వల్ల ఒరిగిందేమీ లేదు.          
  - వికలాంగుడు, మన్నవ హనుమంతరావు, పెనుమాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement