సీన్-1: ఫ్లాష్‌బ్యాక్
సుమారు ఆరు నెలల క్రితం ఏలూరు ఆటోనగర్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంటి వద్ద జరిగిన సీన్ అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. పొద్దుపోయాక వెళ్లిన పోలీసులకు టీడీపీ నేతలు అర్ధరాత్రి వరకు సినిమా చూపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు. ఆయన అరెస్ట్‌ను అడ్డుకుని నానాయాగీ చేశారు. నాగభూషణం తెలుగుదేశం పార్టీ నాయకుడా అంటే.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీ సభ్యత్వమన్నా ఉందా అంటే.. అదీ ప్రశ్నార్థకమే. మరి టీడీపీ నేతలంతా కట్టకట్టుకుని ఎందుకు వెళ్లారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
సీన్-2 : తాజా దృశ్యం
నాలుగు రోజుల కిందట మంత్రి పీతల సుజాత ఇంటి వాకిట్లో నోట్ల కట్టలు బయటపడి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో పార్టీపరంగా మద్దతిచ్చేందుకు ఏ ఒక్క నాయకుడూ ముందుకు రాలేదు. జరిగిన ఎపిసోడ్‌పై సెల్ఫ్‌గోల్ మాదిరిగా మంత్రి సుజాత స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనీసం విచారణ పూర్తయ్యే వరకైనా ఆమెకు ఎవరూ మద్దతు పలకలేదు. విచారణ కొలిక్కి(?) వచ్చిన తర్వాత ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ కె.రామ్ ప్రసాద్ మొహమాటానికి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ.. టీడీపీలో బలమైన సామాజికవర్గ నేతలు మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. మద్దతు మాట దేవుడెరుగు ఆ ఘటన జరిగిన తర్వాత కనీసం అమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని సీఎం చంద్రబాబు వేల్పూరులో పర్యటించిన సందర్భంలో బయటపడింది.
ఎందుకీ వివక్ష?
సుజాత పార్టీపరంగా జిల్లాకు చెందిన ఏకైక మంత్రి. పైగా దళిత వర్గానికి చెందిన మహిళ. అయినాసరే టీడీపీలో బలమైన వర్గ నేతలు ఆమెను ఎందుకు దూరంగా పెట్టారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీకి పెట్టని కోటగా నిలిచిన జిల్లానుంచి ఒకటి రెండు మంత్రి పదవులు తమకే వస్తాయని ఆ నేతలు భావించారు. అనూహ్యంగా సుజాత మంత్రి పదవి దక్కించుకున్నారు. పైగా ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండే కీలకమైన గనుల శాఖను సొంతం చేసుకున్నారు. దీంతో అహం దెబ్బతిన్న ఆ వర్గ నేతలు ఆమెకు అన్నివిధాలా సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూశారు. తొలినాళ్లలో అందరితో కలిసి ముందుకు వెళ్లాలని చూసిన సుజాత.. సామాజికవర్గ పరిణామాలతో విసిగిపోయి కొన్నాళ్లుగా స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అన్ని వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఏలూరులో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీలోని బడాబాబులకు చెక్‌పడుతూ తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
ఆ బాబు వదిలినా.. ఈ ‘బాబు’లు వదులుతారా
పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే చాలు. మధ్యలో వీళ్లంతా ఎందుకు అన్న ధోరణిలో మంత్రి వ్యవహారశైలి కొనసాగింది. చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఏకైక మార్గంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలే అస్త్రంగా ఎంచుకున్నారు. సందర్భం ఉన్నా.. లేకపోయినా వైఎస్సార్ సీపీపై నిప్పులు చెరగడంతో చంద్రబాబు వద్ద ఆమెకు ఎన్ని మార్కులు పడ్డాయో గానీ.. జిల్లాలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే సుజాత ప్రస్తావన వస్తేనే రగిలిపోతున్న టీడీపీ నేతలు అదును కోసం ఎదురుచూసి ట్రాప్ చేశారని అంటున్నారు.
మంత్రి కోటరీలో అక్రమాలను పక్కా సాక్ష్యాలతో బయటపెట్టేందుకే నోట్ల కట్టల వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీశారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తలబొప్పి కట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో పార్టీ పరువు బజారున పడకూడదని మంత్రి సుజాతను కేసు నుంచి బయటపడేసినా వర్గ నేతలు మాత్రం ఆమెను ఎంతవరకు వదులుతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. మరోపక్క దళిత నేతలు టీడీపీకి ఎంతకొమ్ముకాసినా ‘మా పరిస్థితి ఇంతేనా.. పార్టీలో అగ్రవర్ణాల మోచేతి కింద ఉండాల్సిందేనా. లేదంటే ఇలా ట్రాప్ చేసి నరకం చూపిస్తారా..’ అని ఆందోళన చెందుతున్నారు. పీతల సుజాత ఎపిసోడ్‌తో టీడీపీకి చెందిన దళిత నేతలు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా రాజుకున్న అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
పీతల ఎపిసోడ్ ఏం చెబుతోంది
Published Sun, Jun 7 2015 12:30 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement