144 కేంద్రాలు, 92,892 మంది విద్యార్థులు
అన్ని ప్రాంతాలకు అదనపు బస్సులు
తిరుపతి గాంధీరోడ్డు: ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు జిల్లాలోని 144 కేంద్రాల్లో 92,892 మంది పరీక్షలకు హాజరవుతున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవో నాగభూషణం తెలిపారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు అధికంగా ఉండడంతో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రం వద్ద నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమ యం కంటే గంట ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని 20 గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారని తెలిపారు. ఎండలు ముదిరిపోవడంతో అన్ని పరీక్షా కేంద్రాల్లో మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒకేచోట అధిక కేంద్రాలు ఉంటే అదనంగా ఏఎన్‌ఎంలను నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు ఆయా పరిధిలోని పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిద్ధార్‌థజైన్ ఆదేశించినట్టు ఆర్‌ఐవో తెలిపారు.
11 నుంచి ఇంటర్ పరీక్షలు
Published Sun, Mar 8 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement