సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలోని పేదలకు 12 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర మిషన్, ఎన్టీఆర్ గ్రామీణ గృహ ప్రవేశాలు, చంద్రన్న బీమా పథకాల అమలుపై సోమవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తన మనవడు దేవాన్ష్తో కలసి సీఎం తొలుత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిసందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన లక్ష ఇళ్లకు.. గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒకే రోజు లక్ష గృహప్రవేశాలతో దేశంలోనే రాష్ట్రం ఒక చరిత్ర సృష్టించిందన్నారు. ఎక్కడా పైసా అవినీతి లేకుండా ఈ ఇళ్లను నిర్మించామన్నారు. ఇల్లు, బిల్లు మంజూరు చేసే విషయంలో ఎవరైనా లంచం అడిగితే 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆ ఫొటోలు అప్‌లోడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్ష, వచ్చే జూన్ 8వ తేదీన మరో లక్ష ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
ప్రపంచానికి మహాత్ముడు ఆదర్శం..
స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ ఒక మహానాయకుడే కాదు ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాశక్తి అని కొనియాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. చరిత్ర ఉన్నంత కాలం మహాత్ముణ్ణి ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుందన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కడు పేదరికాన్ని అనుభవిస్తూ విద్యాభ్యాసం చేశారని చెప్పారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన 91 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును బాబు సత్కరించారు.
Published Tue, Oct 3 2017 2:28 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement