
సాక్షి, అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని అందరినీ మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రధాని మాటలకు తానూ మోసపోయానని ఆయన అన్నారు. ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. అనుభవంలేని వాళ్ళు నేనే పాలిస్తా అంటూ రోడ్డు ఎక్కారని చెప్పుకొచ్చారు. ఏటీఎంలలో డబ్బులులేని పాలన దేశంలో సాగుతోందని కేంద్రాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.
మన డబ్బులు మనం తీసుకోవాలంటే క్యూలో నిలబడేలా చేశారని అన్నారు. ఇడ్లీపై కూడా 18శాతం టాక్స్ వేస్తారా, ఇది దారుణమని అన్నారు. ప్రధానమంత్రి మైక్ తీసుకుంటే.. ఎవరూ ఆయనను ఆపలేరని, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ‘మా ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. వేరే వారి మాటలు నమ్మకండి. నేను వేసిన రోడ్ల మీదే నడుస్తూ.. నన్నే విమర్శిస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘చంద్రన్న బీమా పథకం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అసంఘటిత కార్మికుల కుటుంబాల కష్టాలే తనను ఈ పథకం పెట్టేలా చేశాయని అన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్మికశాఖ కమిషనర్ వర ప్రసాద్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్‌ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment