జిల్లాలో ప్రస్తుతమున్న ఆరు రీచ్‌లకు అదనంగా మరో 13 కొత్త ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ కేవీ రమణ వెల్లడించారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ప్రస్తుతమున్న ఆరు రీచ్‌లకు అదనంగా మరో 13 కొత్త ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ కేవీ రమణ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తన క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
చెన్నూరు మండలం ఓబులంపల్లె, సిద్దవటం మండలం జ్యోతి, ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి, సుండుపల్లె మండలం కాల్వపల్లె, వేంపల్లె మండలం కుమ్మరాంపల్లె, పెనగలూరు మండలం హోమంతరాజపురం, ఖాజీపేట మండలం ముళపాక రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్టాక్ పాయింట్ల వద్ద ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ విఫలమవుతున్నందున వారి స్థానంలో జీ-4 సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇకపై అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను ఆయా మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, ప్రభుత్వం నిర్మించే చెక్‌డ్యాముల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లు అనిల్‌కుమార్, బాలసుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీటీసీ బసిరెడ్డి, ఏడీ మైన్స్ అండ్ జియాలజీ శ్రీనివాసులు, డీపీఓ అపూర్వసుందరి, డిప్యూటీ డెరైక్టర్ గ్రౌండ్ వాటర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.