తూర్పుగోదావరి జిల్లా నెట్‌వర్‌క: జిల్లావ్యాప్తంగా వీస్తున్న తీవ్ర వడగాడ్పులకు శుక్రవారం వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది మృతి చెందారు. కె.గంగవరం ఎస్సీ కాలనీకి చెందిన బొమ్ము యేసేబు (62) వడదెబ్బకు గురై మృతిచెందినట్టు వీఆర్‌ఓ ప్రసాద్ తెలిపారు. ఉపాధి పనికి వెళ్లిన యేసేబు ఉదయం పది గంటల సమయంలో వడదెబ్బకు గురై అపస్మారక స్థితికి చేరి మృతి చెందాడు. సామర్లకోట మండల పరిధిలో పి. వేమవరం గ్రామానికి చెందిన తోట చక్రయ్య (60) అనే వృద్ధుడు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. రాజానగరం మండలం నందరాడకు చెందిన మార్కొండ సూర్యాకాంతం (65) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందింది.
రౌతులపూడి మండలం పి. చామవరం శివారు మెరకచామవరం గ్రామానికి చెందిన అడపా వెంకటరమణ(28) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఉదయం పొలంలోకి వెళ్లిన అతడు పనులు ముగించుకొని మధ్యాహ్నం సమయంలో తిరిగి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. సీతానగరం మండలం సింగవరానికి చెందిన ముత్యం సత్యవతి (75), రాపాక గ్రామంలోని బొద్దూరి సత్యనారాయణ (65) వడదెబ్బకు గురై ఇంటి వద్ద మృతి చెందారు. తుని మండలం తేటగుంటలో వడగాడ్పునకు గురై యేలేటి నాగభూషణం(42) మృతి చెందాడని వీఆర్వో నాగన్నదొర తెలిపారు. స్థానిక కెనరా బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న నాగభూషణం రోజులాగే విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటివద్ద నుంచి బయలుదేరి మార్గమధ్యంలో కుప్పకూలి మృతి చెందాడు.
ఆత్రేయపురం మండల పరిధిలోని అంకంపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజ్జ భూషణం (65) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందినట్టు వీఆర్వో నాగేశ్వరరావు తెలిపారు. తొండంగి మండలంలోని పీఈ చిన్నాయిపాలెంలో శుక్రవారం వడదెబ్బకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. పిఠాపురం మండలం వేలంక గ్రామానికి చెందిన పెంకే సత్యనారాయణ (30) కుటుంబసభ్యులతో కొద్ది రోజుల క్రితం పనుల కోసం చిన్నాయిపాలెంలోని మామగారైన రాయుడు ముసలయ్య ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం గ్రామంలో కూలిపనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనపర్తి మండలం పొలమూరు శివారు చిన పొలమూరు గ్రామానికి చెందిన చీకట్ల కొండయ్య(60) అనే రిక్షా కార్మికుడు గురువారం రాత్రి వడదెబ్బకు మృతిచెందాడు.
జగ్గంపేట మండలంలోని జె.కొత్తూరు గ్రామంలో వడదెబ్బకు గురై రాజమండ్రి నాగేశ్వరరావు (60) అనే వృద్ధుడు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నాగేశ్వరరావు ఇంటి వద్దే మృతి చెందాడు. రామచంద్రపురం పట్టణానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు వాడ్రేవు రామారావు (76) వడదెబ్బకు గురువారం రాత్రి మృతి చెందారు. ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడి పాలెం గ్రామానికి చెందిన గాలి జ్యోతిబాబు (34) వడదెబ్బకు శుక్రవారం మృతి చెందాడు. చింతూరు మండలం ఎర్రంపేటకు చెందిన బండి రాము(31) అనే పంచాయతీరాజ్ ఉద్యోగి శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఇటీవల అధికారులు అతడిని భద్రాచలం విధులకు పంపారు. అక్కడ విధులు ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకోగానే ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితికి చేరుని మృతి చెందాడు.
వడదెబ్బకు 14 మంది మృతి
Published Sat, May 23 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement