మనుబోలు : జిల్లా వ్యాప్తంగా 168 ప్రాథమికోన్నత పాఠశాలల (యూపీ స్కూళ్లు)ను రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కనీసం 20 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న యూపీ స్కూళ్లను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 6, 7 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చేర్చించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రతి యూపీ స్కూల్‌లో నలుగురు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారు. రద్దయిన పాఠశాలల్లోని 672 మంది ఉపాధ్యాయులను అదే మండలంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్ ఆర్‌సీ నంబర్ 36/పీఎస్ 1-1-2014 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 371 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 168 మూసివేత జాబితాలో ఉన్నాయి. విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వుల ఆధారంగా జూలై 21న అన్ని మండల విద్యా శాఖాధికారులకు జిల్లా శాఖాధికారి నుంచి ఉత్తర్వులు అందాయి.
ఓ వైపు బడి బయట ఉన్న బాలలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తూ మరో వైపు యూపీ స్కూళ్లకు మంగళం పాడేందుకు సన్నద్ధమవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం వల్ల డ్రాపవుట్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈనెల 4వ తేదీలోపు మండలంలో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న యూపీ పాఠశాలలు, అందులో 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్నత పాఠశాలలు ఉన్నాయా? లేవా? అనే వివరాలను జిల్లా విద్యాశాఖకు అందజేయాల్సి ఉందని మనుబోలు ఎంఈఓ సూర్యనారాయణ తెలిపారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉంటేనే యూపీ పాఠశాలను రద్దు చేస్తారన్నారు. ఈ విషయమై డీఈఓ ఉషారాణిని ‘సాక్షి’ వివరణ కోరగా 168 పాఠశాలలు రద్దవుతాయని తెలిపారు. దీని ప్రకారం మండలంలోని అక్కంపేట, చెర్లోపల్లితో పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు లేని బండేపల్లి, కొలనకుదురు పాఠశాలలు కూడా మూతపడడం ఖాయంగా కనిపిస్తోంది.
మండలాల వారీగా వివరాలు :
జిల్లాలో ఓజిలి మండలంలోనే 10 యూపీ పాఠశాలలు మూతపడనున్నాయి. పొదలకూరు-8, గూడూరులో 7, దుత్తలూరు, ఉదయగిరి, దగదర్తి మండలాల్లో 6 చొప్పున, చిల్లకూరు, కలిగిరి, ఆత్మకూరు, అల్లూరు, సైదాపురం, బాలాయపల్లి, రాపూరు మండలాల్లో 5 చొప్పున, డక్కిలి, చిట్టమూరు, దొరవారి సత్రం, మనుబోలు, చేజెర్ల, వరికుంటపాడు, కొండాపురం, కావలి మండలాల్లో 4 పాఠశాలలు చొప్పున మూసివేయనున్నారు.
తడ, సూళ్లూరుపేట, పెళ్లకూరు, నాయుడుపేట, ముత్తుకూరు, వెంకటాచలం, వెంకటగిరి, వాకాడు, సంగం, కొడవలూరు, విడవలూరు, మర్తిపాడు, జలదంకి, సీతారామపురంలలో మూడు పాఠశాలలు చొప్పున, నెల్లూరు, కలువాయి, అనంతసాగరం, వింజమూరు, అనమసముద్రంపేట, బోగోలు మండలాల్లో 2 చొప్పున, బుచ్చిరెడ్డిపాలెం, విందుకూరుపేట, కోవూరు, తోపపల్లి గూడూరు మండలాల్లో ఒక్కో పాఠశాల మూతపడనున్నాయి. మనుబోలు మండలంలో 10 యూపీ పాఠశాలలకు నాలుగింటిని మూసివేయనున్నారు.
168 యూపీ స్కూళ్ల రద్దు!
Published Fri, Aug 1 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement
Advertisement