చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా 17న జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్య సేవల్ని ఆపివేస్తున్నట్లు సమైక్యాంధ్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐక్య కార్యాచరణ వేదిక ప్రకటించింది. ఈ మేరకు గురువారం చిత్తూరు నగరంలో సంఘ నాయకులు సమావేశమయ్యారు. జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 44 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.
కనీస జ్ఞానం కూడా లేని కొందరు వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం, విద్య పరంగా హైదరాబాదు చాలా అభివృద్ధి చెందిందని దీని వెనుక సీమాంధ్రుల కష్టం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే ఇక్కడి వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో సీట్లు సగానికి పైగా తగ్గిపోతాయన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఉన్న వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మిగిలిన ఆస్పత్రుల్లో లేకపోవడం వల్ల సీమాంధ్రులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ఢిల్లీ పెద్దలకు ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియచేయడంలో భాగంగా సీమాంధ్ర వైద్యసేవల జేఏసీ పిలుపు మేరకు 17న బంద్ నిరహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, నర్సింగ్, పారామెడికల్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు సైతం తమకు మద్దతు పలకాలని కోరారు.
జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని వైద్యులు, సిబ్బంది రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు చేసి సమైక్యాంద్ర ఉద్యమ తీవ్రతను తెలియచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైద్య జేఏసీ నేతలు డాక్టర్ రాజేంద్రకుమార్, డాక్టర్ వినోద్, డాక్టర్ శ్రీరాములురెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ రాజారావు పాల్గొన్నారు.
17న ప్రైవేటు వైద్య సేవల బంద్
Published Fri, Sep 13 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement