కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బలవన్మరణం పొందారు.
కుందుర్పి(అనంతపురం): కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బలవన్మరణం పొందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో జరిగింది. వివరాలివీ.. కుందుర్పి మండలం ఎర్రగుంటకు చెందిన జయరామప్పకు ఇద్దరు కుమారులు నాగరాజు, తిమ్మప్ప. నాగరాజుకు 2012లో బ్రహ్మసముద్రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన తులసి(24)తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం 2014లో నాగరాజు రుద్రంపల్లికి చెందిన చిట్టెమ్మను మరో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు తలెత్తటంతో తులసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇటీవలే, నాగరాజు, చిట్టెమ్మ కలసి వెళ్లి తులసిని తిరిగి తీసుకువచ్చారు. అయితే, శనివారం తులసి పురుగుమందు తాగింది. ఆమెను కర్నూలు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. కాగా, కుటుంబ కలహాల విషయంలో జయరామప్పపై కూడా కేసు నమోదైంది. అతనిని పోలీసులు జైలులో ఉంచి, ఇటీవలే వదిలేశారు. కోడలి మృతి, తనపై కేసు నమోదు వంటి పరిణామాలతో మనస్తాపం చెందిన జయరామప్ప(50) ఆదివారం ఉదయం తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు.