శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్:
పంచాయతీ ఉప ఎన్నికలకు సంబంధించి ఊహించినట్లుగానే జరిగింది. మొత్తం 8 సర్పంచ్, 76 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ జరగ్గా మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యాక తుది వివరాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుడితి(సారవకోట), కొల్లివలస(ఆమదాలవలస), చల్లయ్యవలస(పోలాకి) సర్పంచ్ స్థానాలతో పాటు కంచిలి మండలంలో 4 వార్డులకు, నరసన్నపేట మండలం జమ్ము పంచాయతీ 10వ వార్డులోనే ఈ నెల 18న ఎన్నికలు జరుగనున్నాయి. బుడితి నుంచి ముగ్గురు, కొల్లివలస, చల్లయ్యవలసలలో ఇద్దరేసి బరిలో ఉన్నారు. ఇక ఎన్నికలు జరుగనున్న ఐదు వార్డుల్లో ఇద్దరేసి పోటీపడుతున్నారు. ఇదిలావుంటే పొన్నుటూరు(కొత్తూరు), పట్టుపురం(కోటబొమ్మాళి) సర్పంచ్‌ల స్థానాలకు ఒక్క నామినేషను కూడా దాఖలు కాలేదు. అలాగే 24 వార్డుల్లో కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక బుడుమూరు, సంతబొమ్మాళి, శాసనం సర్పంచ్‌లతో పాటు మొత్తం 47 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు పడటంతో ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరగనున్న పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పంచాయతీ అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ అధికారుల నియామకాలు చేపడుతున్నట్లు డీపీవో చెప్పారు.
బుడుమూరు సర్పంచ్‌గా రమాదేవి
లావేరు: బుడుమూరు సర్పంచ్‌గా కింతలి రమావతి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.చంటిబాబు ప్రకటించారు. సర్పంచ్ కింతలి శ్రీనివాసరావు గత నవంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నికల అవసరమైంది. ఆయన భార్య రమావతిని సర్పంచ్‌గా ఎకగ్రీవంగా ఎన్నికోవడానికి అన్ని పార్టీల నాయకులు అంగీకరించారు. దీంతో ఆమె ఒక్కరే నామినేషన్ వేశారు. ఉపసంరణ ఘట్టం శుక్రవారం ముగియడంతో రమాదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చంటిబాబు ప్రకటించారు. ఆమెకు సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. రమావతిని డీపీవో, ఎన్నికల అధికారి అభినందించారు. కార్యక్రమంలో బుడుమూరు మాజీ ఎంపీటీసీ రేగాన రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పెదనాయిని గోవిందరావు, బొడ్డ రవిబాబు, కింతలి కోటి, వైఎస్సార్ సీపీ నాయకులు కింతలి గోపాలరావు, పెదనాయిని సత్యనారాయణ, టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు సర్పంచ్‌లు, 47 వార్డుల్లో ఏకగ్రీవం
Published Sat, Jan 11 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement