
20 మంది సీఐలకు స్థానచలనం!
► బదిలీలకు రంగం సిద్ధం
► రాజకీయ సిఫార్సులకే కీలక ప్రాధాన్యం
► ఐఏఎస్ బదిలీల కంటే ముందే..
► పైరవీలు ప్రారంభించిన సీఐలు
సాక్షి, గుంటూరు : సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. గుంటూరు రేంజ్ పరిధిలో పెద్దసంఖ్యలో సీఐలను బదిలీ చేయటానికి ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా రెండేళ్ళ కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా రాజకీయ సిఫార్సులు, భారీగా పైరవీలకు తెరలేవటంతో బదిలీల వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోకి వెళ్ళింది. దీంతో కొందరు సీఐలు తమకున్న రాజకీయ పరపతిని వినియోగించి ఆదాయం ఎక్కువ ఉన్న స్టేషన్‌ల పోస్టింగ్ కోసం ముందే లాబీయింగ్ నిర్వహిస్తున్నారు.
సిఫార్సులకే పెద్దపీట!
గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రేంజ్ పరిధిలో రూరల్ ప్రాంతాల్లోని కొన్ని స్టేషన్లు, అలాగే అర్బన్ ప్రాంతాల్లోని కొన్ని పోలీస్‌స్టేషన్ల పోస్టింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయా స్టేషన్లలో పోస్టింగ్ దక్కాలంటే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు భారీగా కొంతమేర చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు నగరంలోని మూడు కీలక స్టేషన్లలకు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోస్టింగ్‌లు డిమాండ్ ఉంది.
వాస్తవానికి రెండు నెలల క్రితమే బదిలీలకు సంబంధించి ఐజీ సంజయ్ ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేసేలా జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అమాత్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలు దాటి సిఫార్సులు చేస్తుండటంతో బదిలీలను అప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పెద్దసంఖ్యలో జరగనున్నాయి.
ఈ క్రమంలో రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలకు స్థానచలనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఐజీ, రూరల్ ఎస్పీ రెండేళ్ళ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీంతో ఇద్దరి బదిలీలు అనివార్యంగా మారాయి. ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హడావుడి మళ్ళీ మొదలైంది.
పల్నాడు ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ...
రేంజ్ పరిధిలోని సీఐల బదిలీలు అన్ని పల్నాడు ప్రాంతంలో ఉన్న ఒక అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా జరుగుతున్న బదిలీల్లో సదరు నేతదే కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సీఐలు సదరు ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి, నరసరావుపేటల్లో యువనేత అవినీతి ఆరోపణలతో నిమిత్తం లేకుండా తనకు కావాల్సిన ఎస్‌ఐలందరినీ ఇప్పటికే బదిలీలు చేయించుకొని పోలీస్ ఉన్నతాధికారులకు సీఐల బదిలీల జాబితా అందజేసినట్లు సమాచారం.
జిల్లాలో మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారు. అయితే మొత్తం మీద కీలకంగా మాత్రం పల్నాడు ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటం గమనార్హం. మరోవైపు 20 మంది సీఐలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ సర్కిల్‌లో ఒకరు, వెస్ట్ సర్కిల్ ఒకరుతో పాటు అర్బన్ పరిధిలో ఆరుగురు సీఐలు బదిలీల జాబితా ఉండే అవకాశం ఉంది.