నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : 2014 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. సందట్లో సడేమియా అన్నట్లు డివిజన్ స్థాయి పోలీస్ బాస్‌ల బదిలీల్లో అధికార పార్టీ నేతలు తమ పరపతి ఉపయో గించినట్లు తెలుస్తోంది. బదిలీల ప్రక్రియలో తలదూర్చి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోవడంలో కృతకృత్యులైనట్లు ఆరోపణలు విని పిస్తున్నాయి.
ముఖ్యంగా నెల్లూరు రూరల్, ఆత్మకూరు డీఎస్పీ లుగా తమకు అనుకూలమైన వారిని బదిలీ చేయించుకున్నట్లు తెలిస్తోంది. తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు వారి కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఐదు పోలీసు సబ్ డివిజన్‌లు ఉన్నాయి.
నెల్లూరు గ్రామీణం, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావడంతో వీరి బదిలీలు తప్పనిసరి అయితే ఆయా స్థానాల్లో అధికార పార్టీ ఒత్తిడి మేరకే పోస్టింగులు ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ఆనం వివేకానందరెడ్డి, ఆత్మకూరు నుంచి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసింది. ఆనం సోదరులు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.
అదే తరహాలో రానున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం స ృష్టించి గెలవడానికే తమకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా బదిలీల్లో జిల్లాలో పోస్టింగ్‌లు దక్కించుకున్న డీ ఎస్పీల్లో ఇద్దరు జిల్లాకు సుపరిచితులే. నెల్లూరు రూరల్ డీఎస్పీగా నియమితులైన వీఎస్ రాంబాబు జిల్లాలో ఎస్‌ఐగా, సీఐగా, సీఐడీ డీఎస్పీగా పని చేశారు. దీంతో ఆయనకు అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన కొద్దికాలంగా నెల్లూరు రూరల్ డీఎస్పీగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు రూరల్, ఆత్మకూరు డీఎస్పీలుగా నియమితులవ్వడం వెనుక మంత్రి ఆనం హస్తం ఉన్నట్లు సమాచారం.
బదిలీలా..
రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ గురువారం రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన నలుగురు డీఎస్పీలు ఉన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కె. బాలవెంకటేశ్వర రావును డీజీపీ కార్యాలయం వీఆర్‌కు, ఆయన స్థానంలో నెల్లూరు సీఐడీ డీఎస్పీగా పని చేస్తున్న వీఎస్ రాంబాబును నియమించారు. ఆత్మకూరు డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ను డీజీపీ కార్యాలయం వీఆర్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి సీఐడీ డీఎస్పీగా పని చేస్తున్న కె. మల్యాద్రిని నియమించారు. కావలి డీఎస్పీ పి. ఇందిరను డీజీపీ కార్యాలయం వీఆర్‌కు, డీజీపీ కార్యాలయం వీఆర్‌లో ఉన్న కె. మహేశ్వరరాజును కావలికి నియమించారు. నెల్లూరు సీఐడీలో పనిచేస్తున్న ఎన్. కృష్ణకిశోర్‌రెడ్డిని పుత్తూరు డీఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీలో పనిచేస్తూ బదిలీ అయిన వీఎస్ రాంబాబు, కృష్ణకిశోర్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమించలేదు.
ఎన్నికల ముంగిట్లో ‘అధికార’ హవా
Published Fri, Nov 29 2013 3:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement