సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఆత్మకూరు స్థానం తమకు దక్కుతుందని ఆశించిన బీజేపీకి అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు రూరల్ సీటు దక్కింది. రెండు పార్టీల మధ్య శనివారం హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఆత్మకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు లోక్‌సభ స్థానాల కోసం బీజేపీ నేతలు పట్టుబట్టారని తెలిసింది.
తొలుత ఆత్మకూరుకు టీడీపీ, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినా, బీజేపీ అంతర్గత వ్యవహారాల అవసరాల రీత్యా నెల్లూరు రూరల్ సీటు కూడా కావాలని పట్టుబట్టినట్లు సమాచారం. రెండు సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించక పోవడంతో తమకు నెల్లూరు రూరల్ ఇవ్వాలని బీజేపీ కోరింది.
ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సరేననడంతో అనూహ్యంగా ఆత్మకూరుకు బదులు బీజేపీకి నెల్లూరు రూరల్ సీటు దక్కింది. ఈ స్థానం నుంచి పార్టీ నాయకుడు సురేష్‌రెడ్డిని పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే టీడీపీ నేతలు ఈ సీటు కూడా కాకుండా బీజేపీని సర్వేపల్లికి పంపాలనే ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.