వైభవంగా ముక్కోటి ఏకాదశి
రామతీర్థం(నెల్లిమర్ల): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గురువారం శ్రీరాముడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పర్వదినం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున నాలుగు గంటలనుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. అలాగే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో మెట్లోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజామున మూడుగంటలకు ఆలయాన్ని కోనేటిజలంతో శుద్ధిచేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ జరిపించారు. తరువాత బాలభోగం నిర్వహించి..మంగళాశాసనం జరిపించారు. ఉదయం 5గంటలకు సీతాసమేత స్వామివారితో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడి విగ్రహాలను పల్లకిలో ఉంచి మేళతాళాలతో ఊరేగింపుగా ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ భక్తుల దర్శనార్థం వేంచేపుచేశారు. అప్పటినుంచి ఉదయం 8గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. అనంతరం ఉదయం 8గంటలకు పల్లకిలో స్వామివారిని ఊరేగింపుగా తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. వర్షం కారణంగా తిరువీధి కార్యక్రమాన్ని రద్దుచేశారు.
ఘనంగా మెట్లోత్సవం
స్థానిక కోందండరామస్వామి వారి ఆలయానికి వెల్లే బోడికొండ మెట్లకు ఘనంగా ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9గంటలకు అధికసంఖ్యలో మహిళలు కొండవద్దకు చేరుకుని ఒక్కోమెట్టుకు పసుపురాసి, బొట్టుపెట్టారు. నెల్లిమర్ల, విజయనగరానికి చెందిన శ్రీవారి సేవాసంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొది మెట్టువద్ద పూజలుచేసి కోందండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘హరే శ్రీనివాసం’ప్రాజెక్టుకు చెందిన మహిళాసభ్యులు కొండపై కోలాటం ప్రదర్శించారు. అలాగే పలువురు భక్తులు భజనలు చేశారు.
శ్రీరాముడ్ని దర్శించుకున్న కేంద్రమంత్రి అశోక్
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి ఉదయం 7గంటల ప్రాంతంలో వచ్చి ఉత్తరద్వారంలో వేంచేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అశోక్ పేరున ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని మూలవిరాట్టును అశోక్ దర్శించుకున్నారు. అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, మల్లికార్జునశర్మ మంత్రికి ఆశీర్వచనం చేశారు. అలాగే ఆలయంలో నెలకొన్న సమస్యలను అర్చకులు మంత్రికి వివరించారు. ఆయన వెంట మిమ్స్ వైద్యకళాశాల చైర్మన్ అల్లూరి మూర్తిరాజు, ఎయిమ్స్ విద్యాసంస్థల ఛైర్మన్ కడగల ఆనంద్‌కుమార్, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు తదితరులున్నారు.
తోటపల్లిలో సీతారామకల్యాణం
తోటపల్లి(గరుగుబిల్లి): మండలంలోని తోటపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీసీతారామస్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన,విశేష హోమములు,పాశురవిన్నపం, మంగళాశాసనం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హనుమత్ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులకు తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామస్వామి ఆలయంలో ఉత్తరద్వారంగుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అలాగే గరుగుబిల్లిలోని శ్రీషిర్డిసాయిబాబా ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాన్ని భక్తులకు కల్పించారు. శ్రీకోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారామస్వామివారి కల్యాణాన్ని ప్రముఖ యజ్ఞకర్త ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజి, ఆలయ అర్చకులు పి. గోపాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణంలో హోమం,యజ్ఞోపవీతధారణ తదితర కార్యక్రమాలును నిర్వహించారు. ముక్కోటి ఏకాదశినాడు లోకకల్యాణార్థం స్వామివారికి కల్యాణం చేస్తే అంతా శుభం జరుగుతుందని అర్చకులు శర్మయాజి తెలిపారు. కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. కల్యాణంలో పాల్గొనే భక్తులకు అన్నదానకార్యక్రమానికి ప్రముఖన్యాయవాది ఎన్.రఘురాం సహా యంచేసినట్లు ఈఓ ఆర్.నాగార్జున తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయసిబ్బంది ఎం. మురళీమోహన్, ఎం.బలరాంనాయుడులు పర్యవేక్షించారు. విజయనగరం మండలం కోరుకొండ సమీపంలో గల ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణంలో ముక్కోటి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు.