‘‘మామ్మగారు..మీరు బాగా నీరసపడ్డారు’’
చెల్లూరు(రాయవరం) : వృద్ధురాలితో ఆ అపరిచితురాలు మాటలు కలిపింది. పరిచయాన్ని పెంచుకుంది. ‘‘మామ్మగారు మీరు బాగా నీరసంగా ఉన్నారు’’ అంటూ తనతో తీసుకొచ్చిన జ్యూస్ ఇచ్చింది... కట్ చేస్తే... వృద్ధురాలి ఒంటిపైన, ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం, నగదు మాయం.
పరిచయం పెంచుకుని...
మండలంలోని చెల్లూరు మార్నివారి వీధిలోని ఈదల నాగేశ్వరరావు ఇంట్లో గోలి లక్ష్మి అనే వృద్ధురాలు అద్దెకు ఉంటోంది. అదే వీధిలో ఇంటిని నిర్మించుకుంటోంది. కొద్ది రోజుల క్రితం సుమారు 22 ఏళ్ల వయస్సు ఉన్న అపరిచితురాలు మామ్మగారు బాగున్నారా... అంటూ పలకరించింది. తాను ఫలానా సామాజిక వర్గం వారి అమ్మాయినంటూ మాటలు కలిపింది. తన భర్త రాజమండ్రిలో పండ్లు కొనుగోలు చేసి రామచంద్రపురంలో విక్రయిస్తుంటాడని తెలిపింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద తాము ఉంటున్నామని, తన ఇద్దరు పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపింది. ఇలా వారంలో రెండు సార్లు వచ్చింది. మొదటి సారి వచ్చినప్పుడు ‘‘నీరసంగా ఉన్నారు జ్యూస్ తాగమని ఆమె కోరినా వృద్ధురాలు నిరాకరించింది.
బంగారం, నగదు చోరీ
సోమవారం మధ్యాహ్నం 12:30 నుంచి ఒంటి గంట సమయంలో మరోసారి ఆ అపరిచితురాలు వృద్ధురాలి ఇంటికి వచ్చింది. ‘బాగా పాడైపోయారంటూ ప్రేమను నటిస్తూ ఆమె వెంట తెచ్చిన ద్రాక్ష జ్యూస్‌ను ఆమెకు ఇచ్చింది. అది తాగిన వృద్ధురాలికి తర్వాత ఏమి జరిగిందో తెలియలేదు. మధ్యాహ్నం నాలుగు గంటలకు మెలకువ వచ్చే సరికి ఆమె వంటిపైన, బీరువాలో ఉన్న 13 తులాల బంగారు చైనులు, గాజులు, రూ.9,500 నగదు చోరీకి గురయ్యాయి.
చోరీ సొత్తు విలువ సుమారుగా రూ. నాలుగు లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. తాను మోసపోయానని గ్రహించిన లక్ష్మి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై కట్టా శ్రీనివాసరావు, ఏఎస్సై కె.వి.వి.సత్యనారాయణలు సంఘటన స్థలానికి వచ్చి వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లూస్‌టీమ్‌ను రప్పించనున్నట్టు ఎస్సై తెలిపారు.