231వ రోజు పాదయాత్ర డైరీ | 231st day padayatra diary | Sakshi
Sakshi News home page

231వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Aug 8 2018 3:30 AM | Last Updated on Wed, Aug 8 2018 7:53 AM

231st day padayatra diary - Sakshi

07–08–2018, మంగళవారం,
బి.బి.పట్నం క్రాస్, తూర్పుగోదావరి జిల్లా

సురాపానంతో ప్రజల్ని నాశనం చేస్తున్న అసుర పాలన

అల్పపీడనం ప్రభావంతో తెరిపినీయకుండా కురిసిన వర్షపు జల్లుల్లోనే శృంగవరం, బంగారయ్యపేట, రౌతులపూడిలలో నేటి పాదయాత్ర సాగింది. మద్యం.. కుటుంబాలను ఛిద్రం చేసిన ఘటనలు కొన్ని నా దృష్టికి వచ్చాయి. శృంగవరంలో ఎందరో ఆడపడుచులు మద్యంపై ఆక్రోశం, ఆవేశం, ఆవేదన వెలిబుచ్చారు. ఆ ఊళ్లో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం పిల్లలను సైతం వ్యసనపరులుగా మార్చేస్తోందన్నారు. మద్యంతో తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మద్యం వల్లే మరణించిన అప్పలరాజు, అప్పారావు కుటుంబాల విషాదం గురించి వివరించారు. ‘మీరు వచ్చాకైనా మా ఊళ్లో మద్యం లేకుండా చేయండన్నా’అంటూ దీనంగా అడిగారు. 

ఆ ఊళ్లోనే కలిసిన ఎమ్మలి సీతమ్మది మరో బాధ. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న భర్తకు లివర్‌ చెడిపోయి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. కారణం.. మద్యమే. ‘ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటన్నా’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బంగారయ్యపేటకు చెందిన పున్నుమంతుల సత్యనారాయణ దినసరి కూలీ. మద్యం మత్తులో యాక్సిడెంట్‌ చేయడంతో కాలు విరిగి ఉపాధి పోయింది. ‘మందుల మాట దేవుడెరుగు.. తిండికే కష్టమైపోయింది సార్‌’అంటూ పశ్చాత్తాపపడ్డాడు. 

శృంగవరం దాటగానే పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళా కూలీలు వచ్చి కలిశారు. రోజంతా కష్టపడితే వచ్చే కూలి భర్తల తాగుడుకే ఖర్చయిపోతోందన్నారు. లోవతల్లి భర్త 25 ఏళ్ల చిన్న వయసుకే మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డలిద్దరూ అనాథలయ్యారు. ఆ తల్లి కష్టం తీర్చేదెవరు? ఈ గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. ఫోను కొడితే చేను గట్లకే చీప్‌ లిక్కర్‌ తెచ్చి ఇస్తారట. కిళ్లీ కొట్లలో సైతం మద్యం అమ్మకాలు సాగుతున్నాయట. ఇదీ బాబుగారి సుపరిపాలన.. ‘సురాపానంతో ప్రజల్ని నాశనం చేస్తున్న అసుర పాలన’.  

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మద్యం వల్ల లివర్‌ దెబ్బతిన్న పేషెంట్ల సంఖ్య ఈ నాలుగున్నరేళ్లలో గణనీయంగా పెరిగిందని అక్కడి వైద్యులే చెబుతున్నారు. అలాంటి పేషెంట్లలో అత్యధికులు 30 – 35 ఏళ్లలోపు వారేనట. ఈ రోజు ఉదయం పేపర్లలో చూసిన ఓ వార్త మనసును కలచివేసింది. ముగ్గురు కన్నబిడ్డలను నదిలోకి విసిరేసి ప్రాణాలు తీసిన కసాయి తండ్రి ఉదంతమది.. మద్యం మత్తులో జరిగిన ఘాతుకమది. ఆ తండ్రి చేసింది క్షమించరాని నేరమే. మరి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఇలాంటి తండ్రులను మృగాలుగా మారుస్తున్న పాలకులది అంతకన్నా పెద్ద నేరం కాదా? ఇంతమంది కన్నతల్లుల గుండెకోతకు, అక్కచెల్లెమ్మల కన్నీటి కష్టాలకు కారణమవుతున్న మద్యం అమ్మకాల కాసులతోనే ఖజానా నింపుకోవాలనుకోవడం దురదృష్టకరం. ఆ ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అనాగరికం.
 
దారిలో కలిసిన పోతులూరుకు చెందిన మారంపూడి రాజా మాటలు మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. 2008లో ఆయన భార్యకు అర్ధరాత్రి వేళ పురిటి నొప్పులు వచ్చాయట. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి పరిస్థితి విషమించిందట. ఆ ఊరికి రహదారులు అంతంతే. బస్సే రాని పరిస్థితి. మరే రవాణా సౌకర్యం లేని పల్లెటూరు. ‘సార్‌.. ఆ విషమ పరిస్థితిలో 108కి ఫోన్‌ చేయగానే నిమిషాల వ్యవధిలో వచ్చింది.. ఆస్పత్రిలో చేర్చింది. సమయానికి వైద్యం అందడంతో తల్లీబిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ఆ కష్టం నుంచి గట్టెక్కినందుకు మీ నాన్నగారికి మనసునిండా కృతజ్ఞతలు చెప్పాం. బిడ్డకు జగన్‌ అని మీ పేరే పెట్టుకున్నాం’అని ఆ సోదరుడు చెబుతుంటే చాలా సంతోషమనిపించింది. ప్రజలకు మంచి చేసిన నేతలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. మంచి చేసే పథకాలను నిర్వీర్యం చేసే పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
 
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. రౌతులపూడిలో చేనేత సోదరులు ఆత్మీయంగా స్వాగతించి సత్కరించారు. నాన్నగారి హయాం లో చేనేతకందిన చేయూతను వివరించారు. సంక్షోభంలో కూరుకుపోతున్న చేనేత పరిశ్రమ రాబోయే మనందరి పాలనలో పునరుజ్జీవం పొందుతుందని అపార నమ్మకం వెలిబుచ్చారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బెల్టుషాపుల రద్దు మీ తొలి సంతకాల్లో ఒకటి. కాగా, నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెల్టుషాపుల రద్దు ఊసెత్తడం వంచన కాదా? రాష్ట్రంలో బెల్టుషాపులు లేని గ్రామం ఒక్కటైనా ఉందా? మీ పాలనలో మద్యం అమ్మకాలు రూ.11 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు పెరిగిన మాట నిజం కాదా? మీ పాలనలో ఏపీబీసీఎల్‌ మద్యం గోడౌన్ల సంఖ్య 13 నుంచి 24కు పెరిగింది వాస్తవం కాదా? మద్యం వ్యాపారులకు కమీషన్లు పెంచా లని  మీ కార్యాలయం నుంచే ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతం? నాన్నగారి పాలనలో మాదిరిగా మద్యం దుష్ప్రభావాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క డీఅడిక్షన్‌ సెంటర్‌నైనా ఏర్పాటు చేశారా? 
- వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement